అమరావతిలో ఆయన విగ్రహం ఎందుకు పెట్టడం లేదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్య కారకుడైన పొట్టి శ్రీరాములు విగ్రహం, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు తగిన గౌరవం ఇవ్వకపోవడం మంచిదికాదని హితవు పలికారు.
దేశంలో రైతులు మొదటి సారి రోడ్ల మీదకి వస్తున్నా, సాయం చేయాలని ఇది ప్రధాని మోదీకి లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కూడా రుణమాఫీ చేయడంలో విఫలమయ్యాడని మండిపడ్డారు. జీఎస్టీతో రైతులకు న్యాయం జరుగుతుందని భావించానని కానీ ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ విషయంలో రైతులను దారణంగా మోసం చేసిందని విమర్శించారు. పంటల మీద, వ్యవసాయ పరికరాల మీద జీఎస్టీ వేయ్యొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరధ, గ్రానైట్ కోసం అడిగిన కేసీఆర్, రైతుల కోసం అడగలేదని మండిపడ్డారు.