
చీమకుర్తి పోలీస్‌స్టేషన్ ఎదుట కర్నూల్‌రోడ్డుపై ధర్నా చేస్తున్న మృతుడు తల్లి సుబ్బాయమ్మ, బంధువులు
చీమకుర్తి రూరల్: నన్ను కూడా పెట్రోల్ పోసి చంపండి లేదా నా కొడుకును చంపిన వాళ్లను అరెస్ట్ చేసి న్యాయం చేయండి. అంతేగాని రాజకీయ ఒత్తిళ్లతో కేసును నీరుగార్చవద్దని వాడపల్లి సుబ్బాయమ్మ, ఆమె బంధువులు బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు చీమకుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట కర్నూల్‌రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. ఈ నెల 4న హత్యకు గురైన అగ్రహారం గ్రామానికి చెందిన వాడపల్లి రమణయ్య హత్య కేసులో 7 గురు నిందితులని నిన్న మొన్నటి వరకు చెప్పిన పోలీసులు చివరకు 4గురును మాత్రమే అరెస్ట్ చేయటం ఏంటని ప్రశ్నించారు. గత 22 రోజుల నుంచి విచారణ పేరుతో సాగదీసి సాగదీసి నిందితులను పోలీస్‌స్టేషన్‌లో పెట్టి మేపి చివరకు కేసుకు సంబంధం ఉన్న ముగ్గురిని వదిలేశారని మృతుడు రమణయ్య తల్లి సుబ్బాయమ్మ, సోదరుడు ఏడుకొండలు నడిరోడ్డుపై బోరున విలపించారు.
హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి బుధవారం సీఐ మురళీకృష్ణ ఒంగోలులోని తన కారాలయంలో మీడియా ముందు హాజరు పరిచారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు అసలు ముద్దాయిలను వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయండని ఏఎస్‌పీని కాళ్లు పట్టుకున్నా ఫలితం దక్కలేదని, చివరకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదని వాపోయారు. ట్రైనీ ఐపీఎస్ సుమిత్ గరుడ్, సీఐ ఎం.మురళీకృష్ణ ధర్నా వద్దకు వచ్చి విచారణలో నలుగురును మాత్రమే హంతకులుగా నిర్ధారించడం జరిగిందని, ఇంకా ఎవరిపైన అయినా అనుమానాలు ఉంటే వారి పేర్లు చెప్పండి విచారించి తగు న్యాయం చేస్తామని బాధితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అగ్రహారం, చీమకుర్తి, మంచికలపాడు ప్రాంతాల నుంచి మృతుడి తరపున బంధువులు, వారి సానుభూతిపరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొని బాధితులకు అండగా నిలబడ్డారు.