వైబీ హళ్లి చెరువు ఖాళీ
గండితో భారీ నష్టం
మడకశిర రూరల్ :
మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పొంగిపొర్లిన వైబీహళ్లి చెరువు మంగళవారం తెల్లవారుజాముకు పూర్తిగా ఖాళీ అయిపోయింది. చెరువుకు పడిన గండిని సకాలంలో పూడ్చి వేయకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు గ్రామీణులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత చెరువు పొంగి పొర్లిందని, అయితే గండిపడడంతో ఒక్క రాత్రిలోనే నీరంతా హరేసముద్రం చెరువుకు వెళ్లిపోయిందని రైతులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు.
చేతులు కాలాక : చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది అధికారుల పనితీరు. వైబీ హళ్లి చెరువుకు పడ్డ గండిని ఆర్డీఓ వెంకటే శు, ఇరిగేషన్ అధికారులు మంగళవారం ఉ దయం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువుకు పడ్డగండిని పూడ్చడానికి అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. ఇరిగేషన్ శాఖ ఎఈ, డీఈలు అక్కడే ఉంటూ జేసీబీల ద్వారా పనులు చేపట్టారు. చెరువులో నీరంతా వెళ్లిపోయిన తర్వాత అధికారులు చేపట్టిన చర్యలు పలు విమర్శలకు దారి తీశాయి.