జై బల‘రామ’ | vaikunta ekadasi celebrations at bhadrachalam | Sakshi
Sakshi News home page

జై బల‘రామ’

Published Thu, Jan 9 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM

జై బల‘రామ’

జై బల‘రామ’

  • శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు
  •      కల్యాణ మండపంలో భక్తుల కోలాహలం
  •      నేడు శ్రీకృష్ణావతారంలో వైకుంఠ రామయ్య
  • భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య బలరామావతారంలో దర్శనం ఇచ్చారు. స్వామివారు బలరామ రూపంలో కనిపించిన వెంటనే భక్తులు నీరాజనాలు పలికారు. ఆదిశేషుని అంశతో జన్మించిన బలరాముడు తమ్ముడు శ్రీ కృష్ణునికి ధర్మస్థాపనలో సహకరించారు. అపరపరాక్రముడిగా పేరొందిన బలరామయ్య రూపంలో భద్రాద్రి రాముని ఆలయ అర్చకులు తీర్చిదిద్దారు. ఆహా..ఏమి ఈ దర్శనభాగ్యం అంటూ భక్తులు పులకించిపోయారు.
     
     బుధవారం తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాతం, ఆరాధన సేవలు, బేడామండపంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆళ్వార్లతో కూడిన ఉత్సవమూర్తులకు స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు తదితర అర్చకులు 200 దివ్య ప్రబంధాలను పఠించారు. అనంతరం స్వామివారిని బలరామావతారంలో అలంకరించిన బేడా మండపంలో భక్తుల దర్శనార్థం కొద్ది సేపు ఉంచారు. అంతరాలయం నుంచి బయటకు తీసుకొచ్చిన స్వామి వారికి ఆలయ ఈవో ఎం. రఘునాథ్, భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి బి. శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. మహిళల కోలాటాలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణాల నడుమ స్వామివారిని గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఊరేగింపుగా కల్యాణ మండపం వ ద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద భక్తుల దర్శనార్థం ఉంచారు. పల్లకిపై విచ్చేసిన స్వామివారికి దారి పొడువునా భక్తులు మొక్కులు చెల్లించారు. వేదిక వద్ద ఆలయ అర్చకులు స్వామివారికి హారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించారు. భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలను అందించి నైవేద్యాన్ని ప్రసాదంగా అందించారు. బలరాముని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
     
     ఊరేగింపుగా విశ్రాంతి మండపం వరకు తీసుకొచ్చి అక్కడ స్వామివారు కొద్ది సేపుతీరిన తరువాత తాత గుడి సెంటర్‌లోని గోవిందరాజస్వామి గుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఈఓ రఘునాథ్, ఏఈవో శ్రవణ్‌కుమార్, ఆలయ ప్రధానార్చకులు పోడిచేటి జగన్నాథాచార్యులు, ఓఎస్డీ సుదర్శన్, పీఆర్‌వో సాయిబాబా, ఆలయ అర్చకులు విజయరాఘవన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
     
     నేడు శ్రీ కృష్ణావతారం
     అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం శ్రీ కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా జన్మించి, దుష్టులైన కంసుడు, నరకాసురుడు, శిశుపాలుడు మొదలైన వారిని వధించి, ధర్మవర్తనులైన పాండవుల పక్షం వహించి, కురుక్షేత్ర సంగ్రామంలో ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీతను అర్జునునికి బోధించి, మావన ఆదర్శాలను, ధర్మాన్ని స్థాపించిన శ్రీమన్నారాయణుని పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. చంద్రగ్రహ బాధలున్నవారు శ్రీ కృష్ణుని రూపంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే శుభఫలితాలు చేకూరుతాయని వేదపండితులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement