రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు 2 కిలోమీటర్ల మేర నిలిచి ఉన్నారు. తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు వీఐపీ దర్శనం కొనసాగింది. శ్రీవారి 5 వేల మంది వీఐపీలు దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 18గంటలు, కాలినడక భక్తులకు 10 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేశారు.
భద్రాచలంలో ఉత్తర ద్వారం నుంచి సీతారామ చంద్రస్వామి దర్శనమిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమించుకుంటున్నారు. ద్వారకా తిరుమలలో ఘనంగా వైకుంఠ ఏకాదాశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వార నుంచి స్వామివారిని భక్తులు దర్శనం ఇస్తున్నారు. ఇక శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తర ద్వారం నుంచి మల్లన్న దర్శనమిస్తున్నారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోనూ భక్తులు బారులు తీరారు.
కరీంనగర్ జిల్లా వేములవాడకు భక్తులు పోటెత్తారు. అన్నవరం సత్యనారాయణస్వామి దర్శనానికి వేలాది భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువజాము నుంచి వేచి ఉన్నారు. సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భక్తులు వేలాది తరలివచ్చారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వేకువ జామున మూడు గంటల నుంచే దేవాలయాల వద్ద భక్తులు క్యూలు కట్టారు. బంజారా హిల్స్ లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తుల భారీ సంఖ్యలో ఆలయాలకు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జియా గూడలోని రంగనాథస్వామి ఆలయంలో వేలాది భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి ఉన్నారు. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.