తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగనుంది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ మేరకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రెండు రోజులతో ప్రారంభమై...
శ్రీవారి ఆలయంలో 2020కి ముందు వరకు వైకుంఠ ద్వారాన్ని రెండు రోజులపాటు మాత్రమే తెరిచి ఉంచేవారు. ఆ తర్వాత నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించేలా సంప్రదాయాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ పది రోజులలో ముక్కోటి దేవతలుగా భావించే వరుణుడు, వృషభుడు, నహుషుడు, ప్రత్యూషూడు, జయుడు, అనిలుడు, విష్ణుడు,ప్రభాసుడు, అజైతపాత, అహిర్భుద్నుడు, విరుపాక్షరుద్రుడు, సురేశ్వరుడు, జయంతరుద్రుడు, బహురూపరుద్రుడు, త్య్రంబకుడు, అపరాజితుడు,ౖ వెవస్వతరుద్రుడు, అర్యముడు, మిత్రుడు, ఖగుడు, అర్కుడు, భగుడు, ఇంద్రుడు, భాస్కరుడు, పీషుడు, పర్జన్యుడు, తృష్ణ, విష్ణువు, అజుడు, ఆదిత్యుడు, ప్రజాపతి, పావిత్రుడు, హరుడు వంటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే సమయంలో మానవులు కూడా మహావిష్ణువుని దర్శించుకుంటే అంతే మోక్షం లభిస్తుందని నమ్మకం.
వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత
వేంకటాచల మహత్యంలో దేవతలకు ఉత్తరాయణంలో వచ్చే 6 నెలల కాలాన్ని పగలుగా, దక్షిణాయనంలో వచ్చే 6 నెలల కాలాన్ని రాత్రిగా పేర్కొంటారు. దక్షిణాయనంలో చివరి నెల ధనుర్మాసాన్ని దేవతల నెలగా భావిస్తారు. దేవతలకు ఈ నెల బ్రహ్మ ముహూర్తం. అదే సమయంలో ముక్కోటి దేవతలు మహవిష్ణువుని దర్శించుకుంటారు. అందుకు అనుగుణంగా ధనుర్మాసం నెలను పండుగ నెలగా భావించి భక్తులు ఆలయ సందర్శనం చేస్తుంటారు. విష్ణువుకు తిథులలో ఏకాదశి, ద్వాదశి అతిముఖ్యమైనవి. వైకుంఠ ఏకాదశి నుంచి వైష్ణవ ఆలయాలలో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఆ రోజున విష్ణువు ఉత్తరద్వారం వద్ద దేవతలకు దర్శన భాగ్యం కల్పిస్తారని ప్రతీతి. అదే సమయంలో వైష్ణవ ఆలయాల్లో కూడా ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచడంతో దేవతలకు మహవిష్ణువు దర్శనమిచ్చే సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మహావిష్ణువు భక్తులకు దర్శనమిస్తారని విశ్వాసం.
వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శన భాగ్యం
1863లో ఒక్కరోజుగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం..1949లో 2 రోజులుకు.. 2020 నుంచి వైష్ణవ ఆలయాల తరహాలో 10 రోజులకు విస్తరించింది. దీంతో వైకుంఠంలో మహావిష్ణువు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే 10 రోజుల సమయంలో ఇల వైకుంఠంలో భక్తులకు శ్రీమన్నారాయణుడు దర్శనభాగ్యం లభించడంపై ఆనందం వ్యక్తమవుతోంది.
– వేణుగోపాల దీక్షితులు, టీటీడీ ప్రధానార్చకులు
నేడు స్వర్ణరథంపై ఊరేగనున్న స్వామి వారు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 13న అర్థరాత్రి నుంచి 22 వరకు పది రోజులపాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలగనుంది. 13న ఉదయాత్పూర్వం తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది.
అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేపడతారు. ఈ నెల 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర ముక్కోటి తిరుమలలో ఏకాంతంగా జరగనుంది. శ్రీవారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి ఆలయంతోపాటు, ప్రధాన కూడళ్లలో విద్యుద్దీకరణ పనులను చేపట్టారు. దీంతోపాటుగా ప్రధాన కూడళ్లలో నూతన పూలమొక్కలను ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment