వంశ‘ధార’ వచ్చేనా? | VamsaDhara Tribunal Tour in Uttarandhra | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 24 2018 9:10 AM | Last Updated on Mon, Dec 24 2018 12:04 PM

VamsaDhara Tribunal Tour in Uttarandhra - Sakshi

సాక్షి, అమరావతి: నదీ జలాలపై రాష్ట్ర ప్రజలను హక్కులను పరిరక్షించడంలో సీఎం చంద్రబాబు ఘోర వైఫల్యానికి మరో తార్కాణమిది. గతేడాది సెప్టెంబరు 13న వంశధార నదీజలాల పరిష్కార న్యాయస్థానం (వీడబ్ల్యూడీటీ) ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆశలు నింపుతూ ఇచ్చిన తీర్పును అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తనకు సన్నిహిత మిత్రుడని పదేపదే చెప్పుకొనే సీఎం చంద్రబాబు.. ట్రిబ్యునల్‌ తీర్పుపై ఒడిశా ప్రభుత్వంతో సకాలంలో చర్చించలేదు. ఈ నేపథ్యంలో వంశధార ట్రిబ్యునల్‌ తీర్పులో మార్పులు చేయాలని కోరుతూ ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. దీంతో వంశధార పరివాహక ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో మరోసారి అధ్యయనం చేయాలని నిర్ణయించిన ట్రిబ్యునల్‌ సోమవారం నుంచి ఈనెల 27 వరకు ఆంధ్రప్రదేశ్‌లో, 28, 29 తేదీల్లో ఒడిశాలో పర్యటించనుంది. కనీసం ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ట్రిబ్యునల్‌కు వివరించగలిగితే ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుందని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

115 టీఎంసీలు.. చెరిసగం
వంశధారలో 115 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని 1962లో తేల్చిన ట్రిబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్, ఒడిశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చెరో 57.5 టీఎంసీల చొప్పున కేటాయిస్తూ 1962 సెప్టెంబరు 30న తీర్పు చెప్పింది. వంశధార జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా.. దేశంలోనే అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. 1977 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులకు రూ.933.90 కోట్లతో 2005 ఫిబ్రవరి 25న శ్రీకారం చుట్టారు. నేరడి బ్యారేజీపై ఒడిశా ప్రభుత్వ అభ్యంతరాలకు సహేతుకంగా సమాధానాలు చెబుతూనే ఆయకట్టుకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్‌ వియర్‌ (మత్తడి) నిర్మాణపనులు ప్రారంభించారు.

సైడ్‌ వియర్, నేరడి బ్యారేజీ పనులను సమాంతరంగా చేపట్టి.. గొట్టా బ్యారేజీ కింద 2,10,510 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు వరద కాలువ కింద 20 వేలు, హైలెవల్‌ కెనాల్‌ కింద ఐదు వేలు, హిర మండలం రిజర్వాయర్‌ కింద 20 వేలు వెరసి 45 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించాలని నిర్ణయించారు. కాట్రగడ్డ సైడ్‌ వియర్, నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని ఒడిశా ప్రభుత్వం 2006లో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. కేంద్రం సంప్రదింపులు జరుపుతుండగానే.. వంశధార ప్రాజెక్టు రెండోదశ పనులను నిలిపేయాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి ఆరునెలల్లోగా ఈవివాదాన్ని పరిష్కారించాలని సుప్రీంకోర్టు 2009 ఫిబ్రవరి 6న కేంద్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం 2010 ఫిబ్రవరి 24న వంశధార ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్‌.. కాట్రగడ్డ సైడ్‌ వియర్‌ నిర్మాణానికి అనుమతి ఇస్తూ 2013 డిసెంబర్‌ 12న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తూ 2017 సెప్టెంబరు 13న తుది తీర్పు ఇచ్చింది.

తీర్పు అమలును పట్టించుకోని సీఎం
వంశధారలో 115 టీఎంసీల లభ్యత ఉంటుందని మరోసారి తేల్చిన ట్రిబ్యునల్‌ రెండురాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేస్తూ తీర్పు ఇచ్చింది. నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 106 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ సర్కార్‌కు అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నేరడి బ్యారేజీ జలాలను రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. నేరడి బ్యారేజి పూర్తయిన తరువాత కాట్రగడ్డ సైడ్‌ వియర్‌ను పూర్తిస్థాయిలో తొలగించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు అమలుకు వంశధార నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తీర్పుపై అభ్యంతరాలుంటే మూడునెలల్లో తెలపాలని సూచించింది. ‘దేశంలో నేనే సీనియర్‌ రాజకీయ నాయకుడిని. నలభై ఏళ్ల అనుభవం ఉంది.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పా.. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ నాకు మిత్రుడు’ అంటూ పదేపదే చెప్పే సీఎం చంద్రబాబు.. వంశధార ట్రిబ్యునల్‌ తీర్పు అమలులో చేతులెత్తేశారు. ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఉంటే.. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్పు అమలుకు అంగీకరించేదని, రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేదని.. కానీ సీఎం చంద్రబాబు తమ సూచనలను పట్టించుకోకుండా ఒడిశాతో చర్చించకుండా నిర్లక్ష్యం చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్పులో మార్పులు చేయాలని కోరుతూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిందని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

ఇప్పుడైనా వాదనలు సమర్థంగా వినిపించాలి
వంశధార ట్రిబ్యునల్‌ చైర్మన్‌ ముకుందశర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్‌ బీఎన్‌ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్‌ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్‌ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్‌ అగర్వాల్, సుఖ్‌దేవ్‌ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం సోమవారం నుంచి ఈనెల 27 వరకు శ్రీకాకుళం జిల్లాలో కాట్రగడ్డ సైడ్‌ వియర్, నేరడి బ్యారేజీ, హిరమండలం రిజర్వాయర్, గొట్టా బ్యారేజీలను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. 28, 29 తేదీల్లో ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించి, అధికారులతో సమీక్షించనుంది. ఇప్పుడైనా ట్రిబ్యునల్‌ ముందు వాదనలు సమర్థంగా వినిపిస్తే వంశధార నదీ జలాలపై ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement