భయం.. భయం
► హడలెత్తిస్తున్న భూ ప్రకంపనలు
► ఉదయగిరిలో ఏడాదిలోపు 28 సార్లు కంపనాలు
► శనివారం ఒక్కరోజే ఐదుసార్లు కంపించిన భూమి
► రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు
ఉదయగిరి: పెళపెళమంటూ భారీ శబ్దం.. ఆ వెంటనే కాళ్లకింద భూమి కదులుతున్నట్లు భావన.. ఇళ్లల్లో సామాన్లు కిందపడిపోవడం.. పాత ఇళ్లు బీటలువారడం.. దీంతో వణికిపోతూ బయటకు పరుగులు పెడుతున్న జనం.. ఇవి ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గంలోని పది ఇరవై రోజులకోసారి చోటుచేసుకుంటున్న అలజడి. ఈప్రాంతం భూకంపాల జోన్‌లో లేదని సిస్మోగ్రాఫిక్ అధికారులు చెబుతున్నప్పటికీ అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌కు చెందిన సిస్మోగ్రాఫిక్ అధికారులు ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పరిశోధనలు చేసి భూమి పైపొరల్లో సర్దుబాటు వల్ల సంభవించే సాధారణ ప్రక్రియ అని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ ఈ ప్రకంపనలు మాత్రం ఆగకపోగా.. క్రమేణా తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. శనివారం ఒక్కరోజే ఐదుసార్లు భూమి కంపించడంతో అనేక గ్రామాల ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లేందుకే భయపడుతున్నారు. ఇంటిబయట వీధుల్లోనూ, చెట్లకింద
ఎక్కువసేపు గడుపుతున్నారు. ఐదుసార్లు కంపించిన భూమి
ఇటీవల నేపాల్‌లో పెద్ద పెద్ద భవనాలు భూకంపంతో పేకమేడలా కూలిపోయిన దృశ్యాలు జనా ల కళ్లల్లో ఇట్టే కనిపిస్తున్నాయి. భూకంపం అం టేనే దాని తీవ్రత అధికమా, స్వల్పమా అనేదాని గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండదు. ఏడాది వ్యవధిలోనే 28సార్లు భూమి కంపిస్తే దాని ప్రభావం ఆ ప్రాంత ప్రజలపై ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఐదుసార్లు భూమి కంపించడంతో హడలిపోయా రు. వింజమూరు మండలం చాకలికొండ కేం ద్రంగా రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. గతం లో ఒకట్రెండు సెకన్లపాటు భూమి కంపించేది. కానీ క్రమేణా కంపనాల వ్యవధి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఐదారు సెకన్లు పైగా భూమి కంపిస్తుండడంతో భవిష్యత్తులో ఏ ప్రమాదానికి దారితీస్తుందోనన్న ఆందోళన కని పిస్తోంది.
ఏడాదిలో 28సార్లు ప్రకంపనలు
ఉదయగిరి నియోజకవర్గంలో మొదటిసారిగా 2015 అక్టోబరు 9వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో నాలుగుసార్లు భూమి కంపించింది. అప్పటినుంచి నేటివరకు 28సార్లు సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, వరికుంటపాడు, కొండాపురం, కలిగిరి మండలాలలో భూప్రకంపలు వచ్చాయి. అక్టోబరు 16, 21 తేదీల్లో రాత్రి 9 గంటల ప్రాంతంలో అనేకసార్లు భూమి కంపించింది. నవంబరులో రెండుసార్లు, డిసెంబరులో మూడుసార్లు ఇదే తరహా లో భూమి కంపించింది. ఈ ఏడాది జనవరిలో ఐదుసార్లు కంపించింది. ఫిబ్రవరిలో రెండుసార్లు, మార్చిలో రెండుసార్లు కంపించింది. పది రోజుల క్రితం అర్ధరాత్రి దుత్తలూరు, ఉదయగిరి మండలాల్లో కంపనాలు వచ్చాయి. తాజాగా శని వారం ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మం డలాల తోపాటు ఆత్మకూరు, సంగం మర్రిపా డు, ఏఎస్‌పేట, పొదలకూరు మండలాల్లో ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఐదుసార్లు భూమి కంపించింది.
సిస్మోగ్రాఫిక్ అధికారుల సందర్శన
అనేకసార్లు భూప్రకంపనాలు రావడంతో జిల్లా కలెక్టర్ హైదరాబాద్‌లోని సిస్మోగ్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఏడాది జనవరి చివరి వారంలో మూడురోజులపాటు వరికుంట పాడు, దుత్తలూరు, వింజమూరులోని పలు గ్రా మాల్లో పర్యటించారు. వింజమూరులో, వరి కుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లిలో భూకంపలేఖినిలు ఏర్పాటు చేశారు.
భయపడాల్సిన అవసరం లేదు : ఇన్‌చార్జి కలెక్టర్ ఇంతియాజ్
ఉదయగిరి,కొండాపురం, కలిగిరి, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల తహసీల్దార్లు,కావలి, ఆత్మకూరు ఆర్డీవోలతో శనివా రం సాయంత్రం భూకంపంపై ఇన్‌చార్జ్ కలెక్టర్ ఇంతియాజ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. విం జమూరు మండలం చాకలికొండ కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైందని ఇన్‌చార్జి కలెక్టర్ తెలిపారు. 5.0 లోపు వచ్చే ప్రకంపనాలపై ఆం దోళన చెందాల్సిన అవస రం లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలని తహసీల్దార్లకు సూచించారు. వరి కుంటపాడు ఇన్‌చార్జ్ తహసీల్దార్ వాకా శ్రీనివాసులురెడ్డి సాక్షితో మాట్లాడుతూ మండలంలో భూకంప తీవ్రత ఈసారి కాస్త ఎక్కువగా ఉందన్నారు. 5.0లోపు వచ్చే ప్రకంపనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.