ప్రవేశానికి వేళాయె!
- ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
- ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు జూన్ 16
- పోస్టల్ దరఖాస్తులకు జూన్ 21
- జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్
- జూలై 28 నుంచి తరగతులు
- గ్రామీణ విద్యార్థులకు పెద్దపీట
నూజివీడు, న్యూస్‌లైన్ : ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ(ఆర్కే వ్యాలీ), బాసర ట్రిపుల్ ఐటీలలో 2014-15 విద్యాసంవత్సర ప్రవేశాలకు విశ్వవిద్యాలయ కులపతి రాజ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది.
ఆరు సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ కోర్సుకు సంబంధించి మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 (రాత్రి 8 గంటల వరకు) ఆఖరు తేదీ కాగా, ముద్రిత దరఖాస్తులను జూన్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు అయిన రూ.150 చెల్లించినట్లుగా తెలిపే బ్యాంక్ చలానా గాని, ఏపీ ఆన్‌లైన్ రసీదు గాని జతచేయాలి. పదోతరగతికి సంబంధించిన మార్కుల జాబితాను, హాల్‌టికెట్‌లను కూడా జతచేసి పంపాలి. దరఖాస్తు చేసుకున్నవారిలో ఎంపిక చేసిన జాబితాను జూలై ఎనిమిదిన ప్రకటిస్తారు. జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 27న వెయిటింగ్ జాబితాలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, జూలై 28 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.
సీట్ల కేటాయింపు జరిగేదిలా...
రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు కేటాయించిన మూడువేల సీట్లలో రెండు శాతం మాజీ సైనిక ఉద్యోగుల (కాప్) పిల్లలకు కేటాయిస్తారు. వికలాంగులకు మూడు శాతం, ఎన్‌సీసీ కోటా కింద ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.05 శాతం చొప్పున కేటాయించనున్నారు. నాలుగు కేటగిరీలకు కలిపి మొత్తం 195 సీట్లు పోగా మిగిలిన 2,805 సీట్లలో ఓపెన్ కేటగిరీ కింద 15 శాతం అంటే 421 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 2,384 సీట్లలో ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతానికి 1001 (42 శాతం) సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి 858 (36 శాతం) సీట్లు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంతానికి 525 (22 శాతం) సీట్లు కేటాయించారు.