రంగు వెలిసిందోచ్..!
- అధిష్ఠానం ఇక్కడి ప్రజల
- అభిప్రాయాలకు విలువ
- ఇవ్వకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసింది.
- తెలుగోడి సత్తా ఏమిటో ఢిల్లీ పెద్దలకు చూపిద్దాం.
- పంచెకట్టులోనే కాదు.. చీరకట్టులో కూడా తెలుగువారి పౌరుషం
- ఉంది. ఎన్ని రోజులైనా సరే ఉద్యమం చేసి ఢిల్లీ మెడలు వంచుతాం.
గత జూలై 30న తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుత విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ చిందులివి. అది నిజమేననుకొని వేలాదిమంది విద్యార్థులు తరగతులు బహిష్కరించి మండుటెండలో ధర్నాలు, ప్రదర్శనలు చేశారు.
వీరికి ముందుండి అలుపెరగని పోరు చేస్తున్నట్టు తెగ ఫోజులివ్వడంతో అదంతా నిజమేననుకున్న జనం ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటలీ సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే రాష్ట్రం నుంచి తరిమి కొడతామంటూ ఉద్యోగులు, ఇతర సంఘాల నేతలు ఆరోపణలు చేసిన వేదికను అవినాష్ పంచుకున్నారు. ఈయన మాట కూడా అదే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇలా యూ టర్న్ తీసుకుంటారని అప్పట్లో అనుకోలేదు. ఇది నాటి సంగతి..
మరి నేడో...
విభజన జరిగిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిన తరుణంలో అవినాష్ కూడా పక్క పార్టీలవైపు చూశారు. అయితే ఏ పార్టీలోనూ సముచిత స్థానం లభించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోనే మిగిలిపోయారు. తండ్రి, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ చక్రం తిప్పారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పోటీలో లేకపోవడంతో విజయవాడ ఎంపీ టికెట్ కోసం ఇలా దరఖాస్తు చేశారో.. లేదో ... అలా ఇచ్చేశారు. రాష్ట్రం రెండు ముక్కలైతే విద్యార్థులు పడే బాధల్ని కథలు కథలుగా చెప్పిన అవినాష్.. ఆ సమస్యలకు అధిష్ఠానం పరిష్కారం చూపకపోయినా ఈయన మాత్రం రంగుమార్చేశారు. -సాక్షి, విజయవాడ