
రాత్రి జమ్మలమడుగులో ప్రచారం పూర్తి చేసుకుని వివేకా ఇంటికి చేరుకున్నారని, ఆ తర్వాతే...
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకుట్రను అమలు చేసింది టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డేనని వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆదినారాయణరెడ్డి నీతి, జాతీలేని వ్యక్తి.. మనిషి కాదు దుర్మార్గుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్యలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్‌లు సూత్రధారులన్నారు. 1998నుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని తెలిపారు. 1998లో వైఎస్ రాజారెడ్డిని హత్య చేశారని వెల్లడించారు. ఓ రోజు చంద్రబాబు అసెంబ్లీలో.. కొద్దిరోజుల్లో ఎవరు ఫినీష్ అవుతారో చూడండి అన్నారని, ఆ తర్వాత రెండు రోజుల్లో వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురయ్యారని పేర్కొన్నారు.
ఆ కుట్రలో కూడా టీడీపీకి సంబంధించినవారే ఉన్నారన్నారు. వివేకా హంతకులకు టీడీపీ ఆఫీసులో రక్షణ కల్పించారన్నారు. రాత్రి జమ్మలమడుగులో ప్రచారం పూర్తి చేసుకుని వివేకా ఇంటికి చేరుకున్నారని, ఆ తర్వాతే ఆయన హత్య జరిగిందన్నారు. ఇంటిలిజెన్స్ అధికారులు చంద్రబాబునాయుడు కోసం పనిచేస్తున్నారని, పోలీస్ వ్యవస్థను బాబు భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును కూడా నీరుగార్చారన్నారు. వివేకా హత్యకేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్‌పై తమకు నమ్మకం లేదని, అందుకే సీబీఐతో విచారణ జరపించాలన్నారు. ఆదినారాయణరెడ్డి గతచరిత్ర హంతకుడని, ఆయన ఎన్ని హత్యలు చేయించాడో అందరికీ తెలుసునన్నారు. జమ్మలమడుగులో ఓడిపోతారనే భయంతోనే వివేకాను హత్య చేశారన్నారు.