సాక్షి, న్యూఢిల్లీ: పోంజి స్కీం స్కామ్‌ల నుంచి పేద మదుపర్లకు రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన ‘అనియంత్రిత డిపాజిట్ల నిషేధం బిల్లు-2019’పై సోమవారం రాజ్యసభలో చర్చ జరిగింది. అగ్రిగోల్డ్ తరహా స్కామ్‌లను అరికట్టేందుకు తీసుకువచ్చిన ఈ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా రూ.7వేల కోట్ల రూపాయల మేర అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
32లక్షల మంది పేద, మధ్యతరగతి కుటుంబాలు అగ్రిగోల్డ్ వంచనకు గురయ్యాయని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ దేశంలోని 9మంది డిపాజిట్ రెగ్యులేటర్లలో ఏ ఒక్కరి నుంచి కూడా అనుమతి పొందలేదని తెలిపారు. అనియంత్రిత డిపాజిట్ స్కీమ్‌ల బాధితుల్లో అత్యధికులు నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలే అన్నారు. వారు ఇలాంటి స్కీమ్‌లకు ఆకర్షితులై మోసపోకుండా ఉండేందుకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్కీముల బారిన పడి మోసపోయిన వారికి సత్వర న్యాయం చేసేందుకు ఈ బిల్లు వెసులుబాటు కల్పించడం ప్రశంసనీయం అన్నారు. పోంజి స్కీము ద్వారా మోసాలకు పాల్పడే వారికి 2-7ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 3-10లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఈ బిల్లు కల్పింస్తుందని తెలిపారు.
ఈ బిల్లును మరింత కట్టుదిట్టంగా రూపొందించడానికి వీలుగా విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. అనియంత్రిత డిపాజిట్ల సేకరణ జరగకుండా పర్యవేక్షించే అధికార యంత్రాంగానికి కార్యదర్శి అధ్యక్షత వహిస్తారని బిల్లులో పేర్కొనడం జరిగింది. ప్రభుత్వ కార్యదర్శి కంటే కూడా ఆ స్థానంలో ఆర్థిక వ్యవహారాల నిపుణుడు లేదా బ్యాంకర్‌ను నియమిస్తే ఈ తరహా డిపాజిట్ల సేకరణను ఆదిలోనే నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే అక్రమంగా సేకరించే డిపాజిట్ల సొమ్ము ద్వారా కొనుగోలు చేసే ఆస్తులను సైతం జప్తు చేసి డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే అంశాలను బిల్లులో చేర్చాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే కొన్ని పోంజి స్కీములు రాష్ట్ర సరహద్దులు కూడా దాటి జరుగుతున్నందున అలాంటి వాటిని కూడా ఆయా రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్ సలహా మేరకు నిర్ణీత కోర్టుల పరిధిలోకి తేవాలని విజయసాయి రెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment