విజయ డెయిరీ రాజకీయం వేడెక్కింది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గిరి కోసం టీడీపీ నేతలు బాహాబాహీ పోరాటానికి దిగుతున్నారు.
- చైర్మన్‌గిరి కోసం పోరాటం
- గద్దె దిగనంటే దిగనంటున్న మండవ
- రాజీనామా యోచనలో దాసరి
విజయవాడ : విజయ డెయిరీ రాజకీయం వేడెక్కింది. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గిరి కోసం టీడీపీ నేతలు బాహాబాహీ పోరాటానికి దిగుతున్నారు. చైర్మన్ పదవి కోసం టీడీపీలో రెండు వర్గాలు ప్రతిష్టాత్మక పోరాటం చేస్తున్నాయి. పెద్దల ఒప్పందం ఏమీ లేదు.. తాను పదవిని వీడేది లేదని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ మండవ జానకిరామయ్య మొండికేశారు. గత ఏడాది టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ ఏడాది గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావును చైర్మన్ పదవి అప్పగించాలని పార్టీ నేతలు మండవ జానకిరామయ్యపై ఒత్తిడి తెస్తున్నారు.
నాలుగు రోజులుగా పలు ధపాలుగా టీడీపీ పెద్దలు ఆయనతో చర్చలు జరిపారు. ఎట్టి పరిస్థితిలోనూ తాను పదవి నుంచి వైదొలగేది లేదని మండవ తెగేసి చెప్పేస్తున్నారు. ఎవరు చెప్పినా తాను పదవి నుంచి తప్పుకునేది లేదంటూ ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మచిలీపట్నం ఎంపీ కొనకొళ్ల నారాయణ చేస్తున్న రాజీ ప్రయత్నాలను మండవ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ నెల 25వ తేదీన జరగనున్ను ముగ్గురు పాలక వర్గ సభ్యుల ఎన్నికలకు ఆయన తన ప్యానల్‌ను సిద్ధం చేసుకుని పోటీకి సమాయత్తమయ్యారు. దీంతో టీడీపీ నేతలు అందుకు ప్రతి వ్యూహంగా ప్యానల్‌ను రంగంలోకి దింపారు. టీడీపీలో రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
డెరైక్టర్ పదవికి రాజీనామా యోచనలో దాసరి
ఈ సారి విజయవాడ డెయిరీ చైర్మన్ పదవి దాసరికి ఇచ్చేలా గత సంవత్సరం పార్టీ అధినేత చ ద్రబాబు వద్ద చర్చలు జరిగాయి. దాసరిని గన్నవరం సీటు వదులుకునే విధంగా విజయవాడ డెయిరీ కట్టబెట్టేందుకు పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో గత సంవత్సరం ఇదే రోజుల్లో దాసరి బాలవర్ధనరావు డెరైక్టర్‌గా నామినేషన్ వేశారు. గత సంవత్సరం ఖాళీ అయిన మూడు డెరైక్టర్ల పదవులకు కూడా రెండు ప్యానల్స్ పోటీకి దిగాయి. అయితే దేవినేని ఉమా, ఎంపీ కొనకొళ్ల మధ్యవర్తిత్వం వహించి పోటీ లేకుండా చివరి క్షణంలో ఒక ఒప్పందం కుదిర్చారు. ఈ ఏడాది కూడా మండవ పదవి నుంచి తప్పుకునే పరిస్థితి కనపడటం లేదని చెబుతున్నారు. ఆయన తప్పుకోకుంటే డెరైక్టర్ పదవికి రాజీనామా చేయాలని దాసరి యోచిస్తున్నట్లు సమాచారం.
రంగంలోకి యెర్నేని సీతాదేవి
కృష్ణాజిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య పాలక వర్గంలో 525 మిల్క్ సొసైటీలు ఉన్నాయి. వీటిలో 426 సొసైటీలకు ఓటు హక్కు ఉంది. మొత్తం 15 మంది డెరైక్టర్లకు గానూ, ఈ సంవత్సరం ముగ్గురు డెరైక్టర్ల పదవులకు పోటీ జరుగుతోంది. మిగిలిన 12 డెరైక్టర్లలో ఏడుగురు మండవ వర్గంలో ఉండగా, ఐదుగురు ఆయనకు వ్యతిరేక వర్గమైన దాసరి ప్యానల్‌లో ఉన్నారు. ఎన్నికలు జరిగే మూడింటిని ఎవరు కైవసం చేసుకుంటే వారు విజయ డెయిరీ చైర్మన్ అవుతారు.
ఈ క్రమంలో మండవ బీజేపీకి చెందిన యెర్నేని సీతాదేవిని రంగంలోకి దింపారు. ఈ ఎన్నికల్లో ఆమె డెరైక్టర్‌గా బరిలోకి దిగారు. మండవ ప్యానల్‌లో సీతాదేవి, జాస్తి రాధాకృష్ణ, వల్లభనేని భాస్కరరావు పోటీలో ఉన్నారు. చర్చల్లో మండవ జానకి రామయ్య మాట్లాడుతూ దాసరికి మాత్రం చైర్మన్ పదవి ఇవ్వనని, ఎర్నేని సీతాదేవికైనా పదవిని ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మండవకు వ్యతిరేకంగా దాసరి ఏర్పాటు చేసిన ప్యానల్‌లో గద్దె రంగారావు, వేమూరి వెంకట సాయి, ఉషారాణి పోటీలో ఉన్నారు. వైరి వర్గాల అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఇచ్చారు. వాటితో పోటాపొటీగా ప్రచారం చేస్తున్నారు.