
సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ప్రజలకు చేరువవుతున్న తరుణంలో దానిని ఓర్చుకోలేని చంద్రబాబు ఏదో విధంగా ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు. గతంలో ఇసుక సమస్య, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం గురించి విమర్శలు చేస్తూ, దానిపై ప్రజల నుంచి వారికి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారంటూ ట్వీట్ చేశారు. 'ఇసుక తుపానులో గిర్రున తిరిగి పడ్డాక ఇంగ్లిష్ మీడియంపై గుండెలు బాదుకున్నాడు. ప్రజలు ఛీత్కరించే సరికి అసలు ఇంగ్లిష్ మీడియం ఆలోచనే తనదని యూటర్న్ తీసుకున్నాడు. బతుకంతా అవకాశవాదం, మ్యానిప్యులేషన్లే. పాతాళంలోకి జారిపోయిన మిమ్మల్ని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరంటూ' విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.