ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: జగములనేలే జగజ్జననీ జయంబునీకు అంటూ భక్తులు ఆదివారం విజయదశమి సందర్భంగా అమ్మవారిని స్తుతించి భక్తిశ్రద్ధలతో ప్రార్థించి శరణువేడారు. మహానవమి, విజయదశమి వేడుకలను ఆదివారం పట్టణంలో వైభవంగా నిర్వహించారు. విజయదశమినాడు విజయానికి చిహ్నమైన శమీవృక్షాన్ని దర్శించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ.
అందుకే శమీదర్శనానికి దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించే అన్ని ఆలయాల ఉత్సవ కమిటీవారు అమ్మవారికి శమీదర్శనం చేయించేందుకు ఊరేగింపుగా తీసుకువస్తారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి, శివాలయం, చెన్నకేశవస్వామి, సత్యనారాయణస్వామి, రతనాల వేంటకటశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, ఆత్మారామస్వామి ఆలయాల నిర్వాహకులు అమ్మవారిని, స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించి డప్పువాయిద్యాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాలు, విద్యుత్‌దీపకాంతుల చెట్లు, బాణసంచా పేలుళ్ల మధ్య కొర్రపాడురోడ్డులోని మిల్లులోని శమీదర్శనం చేయించారు.
భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపును తిలకించేందుకు రావడంతో ఆప్రాం తం కిటకిటలాడింది. గ్రామోత్సవంలో కేరళ మహిళా సింగారిమేళం, కళాకారుల ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు, నృత్య ప్రదర్శనలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు, ప్రజలు మిద్దెలపైకి ఎక్కి తిలకించారు. కొర్రపాడు రోడ్డు, వివేకానంద క్లాత్ మార్కెట్, రాజీవ్ సర్కిల్, పుట్టపర్తి సర్కిల్ వరకు భక్తులు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
వైభవంగా అమ్మవారి శమీదర్శనం
Published Mon, Oct 14 2013 1:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement
Advertisement