పట్టణంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది.
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: పట్టణంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మూడు రోజుల క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ పోలీసులు ఆరో రోజైన శుక్రవారం కూడా కర్ఫ్యూను అమలు చేశారు. ముందస్తు ప్రకటన మేరకు ఉదయం 7 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సడలింపునిచ్చారు. ఈ సమయంలో 144వ సెక్షన్ అమలుచేశారు. సడలింపులో ఎటువంటి ఆందోళనలు, సభలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించకూడదన్న పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వాటి జోలికి వెళ్లలేదు.
ప్రధాన జంక్షన్‌లలో పోలీసు బలగాలు గస్తీ నిర్వహించటంతో పాటు వీధుల్లో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. ఓ వైపు రహదారులపై రాకపోకలు సాగుతుండగా మరోవైపు కవాతు నిర్వహించడంతో ప్రజలు కాస్త ఆందోళనకు గురయ్యారు. ఐజీ ద్వారకా తిరుమలరావు, విశాఖ రేంజ్ ఐజీ పి.ఉమాపతి, ఎస్పీ కార్తికేయలు పట్టణ వీధుల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయం ముగిసిన తర్వాత ఏ ఒక్కరినీ రోడ్లపై తిరగనివ్వలేదు. కేవలం అత్యవసర పనులు నిమిత్తం వచ్చిన వారికి మాత్రమే అనుమతిచ్చారు.
తెరుచుకున్న పాఠశాలలు... పట్టణంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వారం రోజులుగా మూతపడిన ప్రధాన ఆలయాలు, ప్రైవేటు పాఠశాలలు, బ్యాంకులు శుక్రవారం తెరుచుకున్నాయి. విద్యార్థులు బడిబాట పట్టగా, ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మవారి దేవాలయంతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలనూ తెరవడంతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల సమయం ముగిసిన మరుక్షణం కర్ఫ్యూ అమల్లోకి రావడంతో ప్రజలంతా ఇంటి ముఖం పట్టారు. పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న వ్యాపారులను, యువకులను పోలీసులు హెచ్చరించి పంపించి వేశారు. అయితే సినిమా థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు.
కిటకిటలాడిన రహదారులు.. పోలీసు అధికారులు ప్రకటించిన కర్ఫ్యూ సడలింపు సమయం లో పట్టణంలోని అన్ని ప్రధాన రహదారులు ప్రజల రాకపోకలతో కిటకిటలాడాయి. మరో రెండు రోజుల్లో జరగనున్న దసరా పండగకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేసే వారితో గంటస్తంభం వద్ద ఉన్న పెద్ద మార్కెట్ కిక్కిరిసిపోయింది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చి సరుకులను కొనుగోలు చేశారు. వస్త్ర, బంగారం దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి నెలకొంది.
నేడు 12 గంటల పాటు కర్ఫ్యూ సడలింపు.. మూడు రోజులుగా అధికారులు ఇస్తున్న కర్ఫ్యూ సడలింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకపోవడంతో శనివారం పగటి పూట 12 గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుందని కలెక్టర్ కాంతిలాల్‌దండే ప్రకటించగా....కర్ఫ్యూ సడలింపు సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ కార్తికేయ తెలిపారు. ప్రజలు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.