స్పందించిన  హృదయాలు!  | Vijayanagaram collector helping hand to the poor | Sakshi
Sakshi News home page

స్పందించిన  హృదయాలు! 

Published Sat, Jan 11 2020 5:35 AM | Last Updated on Sat, Jan 11 2020 5:35 AM

Vijayanagaram collector helping hand to the poor - Sakshi

దివ్యాంగురాలికి ఉచితంగా భోజనం అందిస్తున్న విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌

సాక్షి ప్రతినిధి విజయనగరం: సమస్యలు విన్నవించేందుకు ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించడంతో పాటు కనీస సౌకర్యాలు సమకూర్చాలన్న ముఖ్యమంత్రి జగన్‌ సూచనలను అనుసరిస్తూ ఒకడుగు ముందుకు వేసి దాదాపు 300 మంది ఆర్జీదారులకు విజయనగరం కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ప్రతి సోమవారం భోజనం సమకూరుస్తున్నారు. రూ.50 విలువ చేసే భోజనాన్ని రూ.10కే అందజేయడాన్ని 2018 అక్టోబర్‌ 6న కలెక్టరేట్‌లో ప్రారంభించారు. జిల్లా అధికారులే చందాలు వేసుకుని ఈ సబ్సిడీ ఖర్చును భరిస్తుండటం గమనార్హం. కలెక్టర్‌ ఇంటి ఆవరణలో పండించిన కూరగాయలనే వంట కోసం వినియోగిస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని చూసి స్థానికులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా కొంత దానంగా ఇస్తున్నారు. ఫలితంగా ఇప్పటివరకు దాదాపు 15 వేల మందికి భోజన సదుపాయం కల్పించగలిగారు. తాజాగా వికలాంగులకు పది రూపాయలు కూడా తీసుకోకుండా ఉచితంగానే భోజనం అందిస్తున్నారు. 
విజయనగరం కలెక్టరేట్‌ క్యాంటీన్‌ వద్ద పేదలకు రూ.10కే భోజనం అందిస్తామంటూ ఏర్పాటు చేసిన బ్యానర్‌ 

కష్టం తీరుస్తామనే నమ్మకం కలిగించాలి.. 
‘కష్టం వచ్చిందని ఎవరైనా మన వద్దకు వస్తే.. ఆ కష్టం నుంచి వారికి విముక్తి కలుగుతుందనే నమ్మకాన్ని మనం కలిగించాలి. బాధల్లో ఉంటూ మన సాయం కోసం వచ్చిన వారిని గౌరవించాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచనలకు అనుగుణంగా ‘స్పందన’ మొదలైంది. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వస్తున్నారు. వీరంతా నిరుపేదలు. వారివద్ద చార్జీలకు కూడా సరిపడా డబ్బులుండవు. వీరి కష్టాలు స్వయంగా చూసిన కలెక్టర్‌తోపాటు అధికారులంతా ఆలోచించారు. అప్పుడు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఓ అధికారి తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా పేదల భోజనం కోసం రూ.10 వేలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలా సాయం చేసేందుకు అంతా ముందుకొచ్చారు. వీరితో స్థానికులు చేయి కలిపారు. ఉచిత భోజనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో నామమాత్రంగా రూ.10 చొప్పున తీసుకోవాలని నిర్ణయించారు. కలెక్టరేట్‌లో క్యాంటీన్‌ నిర్వాహకులకు వంట చెరకు, తాగునీరు ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు.  

ఆ మెట్లపై మరెవరూ దిగాలుగా కూర్చోలేదు.. 
‘ఓ రోజు మధ్యాహ్నం.. భోజనం చేద్దామని వెళ్తుంటే మెట్లమీద నిస్సహాయంగా కూర్చున్న పెద్దాయనను చూశా. చాలా నీరసంగా కనిపించాడు. పలకరిస్తే తనది కొమరాడ మండలమని చెప్పాడు. చాలా ఆకలిగా ఉన్నా భోజనం చేస్తే ప్రయాణానికి డబ్బులు ఉండవని చెప్పడంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఘటన వేలాది మంది పేదల ఆకలి తీర్చేందుకు కారణమైంది. ఇక ఆ తర్వాత ఆ మెట్లపై మరెవరూ దిగాలుగా కూర్చోలేదు. ఆ పెద్దాయనలా ఇంకెవరూ ఆకలితో బాధపడలేదు’ 
– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ (విజయనగరం జిల్లా కలెక్టర్‌)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement