విజయవాడలో జరిగిన ధర్నాకు హాజరైన బీసీలు
విజయవాడ సిటీ: బీసీల కష్టాలు తీరి, జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీలను చంద్రబాబు మోసం చేసిన తీరుపై గురువారం వైఎస్సార్ కాంగ్రె‹స్ పార్టీ బీసీ సెల్ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీసీలను ఓటు బ్యాంకుగా భావించి మోసం చేస్తున్న చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై గుణపాఠం చెప్పాలన్నారు. ఆదరణ పేరుతో బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు జీవన పరిస్థితులు అలాగే ఉండాలనే ఉద్దేశంతో వారికి పనిముట్లు చంద్రబాబు మభ్యపెడుతున్నారన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. బీసీల సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే సీఎం హోదాలో ఉండి అవహేళన చేసిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మాయల ఫకీర్ చంద్రబాబును వ చ్చే ఎన్నికల్లో సాగనంపాలన్నారు.
బీసీలను జడ్జీలు కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుతంత్రాలను వివరించారు. దమ్మిడీకి పనికిరాని వారిని జన్మభూమి కమిటీ పేరుతో ప్రజలపై రుద్ది రాజ్యాంగాన్ని చంద్రబాబు అవహేళన చేశారని మండిపడ్డారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో బీసీలు డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డారన్నారు. అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. అటువంటి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను చంద్రబాబు నీరుగార్చి అడ్డంకులు సృష్టిస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, డ్వాక్రా అక్కాచెల్లిమ్మలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఇలా అందర్నీ చంద్రబాబు మోసం చేశాడన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ చంద్రబాబుకు అణగారిన వర్గాలంటే చులకన అన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ చంద్రబాబు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు అణగారిన వర్గాల జీవన స్థితిగుతులు మారుస్తాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ సాంబూ, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోను రాజేష్, బొమ్మ న్న శివశ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాసరావు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. నేతలు ర్యాలీగా వెళ్లి విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment