సాక్షి, విశాఖపట్నం: విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు ఈ నెల 30 నుంచి అయిదురోజుల పాటు నిర్వహించనున్నామని ఆ పీఠ ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హైందవ ధర్మ పరిరక్షణలో విశాఖ శారదా పీఠం రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం చేస్తోందన్నారు. ఇక గురువారం ఉదయం శారదా పీఠం వేడుకలు ప్రారంభం కాగా ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. అయిదు రోజుల పాటు ఘనంగా జరగనున్న ఈ వేడుకల్లో రాజశ్యామల అమ్మవారి విశేష యాగం, టీటీడీ చతుర్వేద సంహిత యాగం, తదితర హోమాలు చేయనున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 1న విఠల్ దాస్ మహరాజ్ భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. శాస్త్ర సభల్లో అధ్యయనంతోపాటు, వాటిని పరిరక్షిస్తున్న పండితులను స్వర్ణ కంకణ ధారణతో ఘనంగా సత్కరిస్తామని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జాతీయ శాస్త్ర సభలు, అగ్నిహోత్ర సభలు ప్రత్యేకంగా నిలుస్తాయని.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment