
వైజాగ్ టు హైదరాబాద్
- జోరుగా గంజాయి అక్రమ రవాణా
- టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన మరో ముఠా
- ఇరువురి అరెస్ట్.. 20 కిలోలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: టాస్క్‌ఫోర్స్ పోలీసుల వలలో గంజాయి ముఠా చిక్కింది. గడిచిన 40 రోజుల్లో నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ తరహాకు చెందిన మూడు ముఠాలను పట్టుకున్నారు. తాజాగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ ఆదివారం మరో ఇద్దరిని అరెస్టు చేసి, 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుందని డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బెనబోపాలపల్లికి చెందిన జలారి గోవింద వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి పండించేవారి నుంచి దాన్ని ఖరీదు చేసి తన ఇంటిలోనే నిల్వ ఉంచుతాడు.
హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఉన్న గంజాయి విక్రేతలకు దీన్ని సరఫరా చేస్తుంటాడు. కిలో రూ.3 వేలకు ఖరీదు చేసి రూ.ఐదు నుంచి రూ.ఏడు వేలకు విక్రయిస్తుంటాడు. హైదరాబాద్‌లోని కార్వాన్ ప్రాంతానికి చెందిన సంజు సింగ్, కరీంనగర్‌కు చెందిన వై.శ్రీనివాస్ ఇతడి నుంచి గంజాయిని తరచూ ఖరీదు చేసేవారు. సంజు, శ్రీనివాస్‌లకు గంజాయి అందించేందుకు గోవింద్ తన బంధువు పి.దుర్గాప్రసాద్‌తో కలసి సిటీకి చేరుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వం లో పోలీసులు ఆదివారం దాడి చేసి ఇరువురిని అరెస్టు చేశారు. 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సంజుసింగ్, శ్రీనివాస్ కోసం గాలిస్తున్నా రు. సేకరణ, రవాణా సైతం తేలిక కావడంతో అనేకమంది గంజాయివైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్తున్నారు.