సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ : విజయ‘నగరానికి’ మహర్దశ కలగనుంది. కార్పొరేషన్ హోదా రావడంతో కేంద్రం నుంచి నిధుల మంజూరు శాతం రెట్టింపుకానుంది. మౌలిక వసతులు కలగనున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్న ఆశలు పట్టణ వాసుల్లో చిగురిస్తున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ 1888 ఏర్పడింది. 1998 నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేరింది. 57.01 చదరపు కిలోమీటర్ల పరిధిలో మున్సిపాలిటీ విస్తరించి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం విజయనగరం పట్టణంలో 2,44,598 మంది జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం రూ.21 కోట్లు కాగా.. ఖర్చు రూ.15 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇవే ప్రామాణికాలతో విజయనగరానికి ప్రభుత్వం కార్పొరేషన్ హోదా కల్పించడం పట్టణవాసుల్లో ఆనందం నింపుతోంది.
చిగురిస్తున్న ఆశలు...
కార్పొరేషన్‌గా ఆవిర్భవించిన విజయనగరం పరిధిలోని సుమారు 300 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఎంత వరకు గాడిన పడుతుందన్న భావన వ్యక్తమవుతోంది. విజయనగరంలో అన్ని ప్రధాన కాలువలతో పాటు చిన్నపాటి కాలువలు సైతం వందేళ్ల కిందట ఏర్పాటు చేసినవే. కాలక్రమంలో వాటిని మరమ్మతులు చేయడం మినహా ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయలేదు. గత పాలకవర్గాల హయాంలో ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించినా మోక్షం కలగలేదు. దీనికి డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలంటే రూ.300 కోట్ల మేర ఖర్చు కావడమేనన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వాలు సైతం నిధులు కేటాయింపునకు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముంపు సమస్యకు మోక్షం కలగలేదు.
ముంపు ప్రాంతాలకు విముక్తి..!
పట్టణంలోని పెద్దమార్కెట్, పుచ్చలవీధి, మేదరవీధి, కోలగట్లవారివీధి, న్యూపూర్ణా జంక్షన్, పాతబస్టాండ్ డ్రైనేజీల నుంచి వచ్చే మురుగు, వర్షపు నీటితో పెద్దచెరువు నిత్యం నిండుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చెరువు కింద సాగుభూమి విస్తీర్ణంతో పాటు చెరువునీటి వినియోగం కూడా తగ్గుతోంది. అధిక వర్షాల కురిసే సమయంలో చెరువునీటి మదుముల తలుపులు తెరుస్తున్నారు. దీంతో పెద్దచెరువుకు దిగువ భాగంలోని సాగుభూమికి ఆనుకొని ఉన్న తోటపాలెం, సిద్ధార్థనగర్, సాయినగర్, భవానీనగర్, గాయత్రీనగర్ ప్రాంతాలు మురుగునీటితో మునిగిపోతాయి. మరోవైపు నిండిన చెరువులోని మురుగునీరు ఉత్తరాన ఊరు పైభా గంలో నిల్వ ఉండి∙న్యూపూర్ణా జంక్షన్ పెద్దమార్కెట్, మున్సిపల్ కార్యాలయం ప్రాంతంముంపునకు కారణమవుతోంది. ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది.
తాగు నీటి సరఫరాపై అంచనాలు..
ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం నగరంలో ఉన్న జనాభాకు ప్రతిరోజు నీటిని సరఫరా చేయాలంటే 36 ఎంఎల్‌డీ అవసరం. ప్రస్తుతం మధుపాడ రక్షిత మంచి నీటి పథకం నుంచి 2 ఎంఎల్‌డీ నీరు, నెల్లిమర్ల, రామతీర్థం రక్షిత మంచి నీటి పథకాల నుంచి మరో 12 ఎంఎల్‌డి నీరు మాత్రమే సరఫరా అవుతోంది. మరో 22 ఎంఎల్‌డీ నీరు కొరత కనిపిస్తోంది. వేసవిలో నెల్లిమర్ల మీదుగా ప్రవహించే చంపావతి నది ఎండిపోవటంతో భూగర్భజలాలు తగ్గిపోయి నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది తాటిపూడి జలాశయంలోనీరు అడుగంటి పోవటంతో తాగు నీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. రామతీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి దశాబ్దాల కిందట వేసిన పైప్‌లైన్, పథకాలకు మోటార్లు బిగించడం, జనరేటర్, ట్రాన్స్‌ఫార్లర్ల సదుపాయం కల్పించడం వంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి.
మొత్తం 313 కిలోమీటర్ల పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఏడాది వ్యవధిలో కేవలం 200 కీలోమీటర్ల మేర పూర్తి చేయగలిగారు. ఈ పథకంలో రెండవ ప్యాకేజీ కింద చేపడుతున్న పనుల్లో పూల్‌బాగ్‌కాలనీ శివారుల్లో ఉన్న వ్యాసనారాయణమెట్ట ప్రాంతంలో రూ.96 లక్షల వ్యయంతో 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తియితే ప్రజలకు తాగు నీటి కొరత తీరుతుంది. మరోవైపు 40 వార్డులుగా విస్తరించిన నగరంలో వీధి దీపాల నిర్ణహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.
సిబ్బంది పెరిగితే చాలు...
విజయనగరం పట్టణంలో పారిశుద్ధ్య సమస్యకు సిబ్బంది కొరతే కారణమన్న వాదన వినిపిస్తోంది. మున్సిపాలిటీగా ఉన్న సమయంలో 275 మంది రెగ్యులర్ సిబ్బంది, 275 ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో పలువురు సిబ్బంది మరణించటంతో రెగ్యులర్ కార్మికుల సంఖ్య 230 తగ్గింది. తాజాగా కార్పొరేషన్ హోదా దక్కించుకోవడంతో సిబ్బంది సంఖ్య పెరిగితే పారిశుధ్యం మెరుగవుతుందన్న ఆశ వ్యక్తమవుతోంది.
పార్కులకు కొత్త హంగులు...!
కార్పొరేషన్ హోదాతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కులు కొత్త హంగులు సంతరించుకునేందుకు అవకాశం ఉంది. 40 వార్డుల్లో 40 వరకు పార్కులుండగా వాటి నిర్వహణ గత 15 ఏళ్లలో పట్టించుకోలేదు. వాస్తవానికి ఇందులో కొన్ని ఉడా పరిధిలో ఉండగా.. మరికొన్ని మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. కార్పొరేషన్ హోదాతో పార్కులను సుందరంగా అలకరించేందుకు ఆస్కారం ఉం టుంది. పక్కనేఉన్న జీవీఎంసీ తరహా పట్టణంలోని ప్రధాన కూడళ్లను పచ్చని నందన వనాల్లా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా పట్టణ రూపరేఖలు మారిపోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment