విశాఖపట్నం విజన్‌ | VMRDA Is Master Plan For The Development Of The Visakhapatnam City | Sakshi
Sakshi News home page

విశాఖపట్నం విజన్‌

Published Tue, Jul 7 2020 1:08 PM | Last Updated on Tue, Jul 7 2020 2:52 PM

VMRDA Is Master Plan For The Development Of The Visakhapatnam City - Sakshi

విశాఖ నగరం మూడు వైపులా విస్తరిస్తోంది.అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది. వలసలతో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. మరోవైపు నగరం  ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఎదగాలనే అంశంపైనా  మాస్టర్‌ ప్లాన్‌కి అనుబంధంగా పర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌కి తుదిమెరుగులు దిద్దుతోంది.

సాక్షి, విశాఖపట్నం: వీఎంఆర్‌డీఏ పరిధిలో ప్రస్తుతం 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. మాస్టర్‌ప్లాన్‌ రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార  గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలతోనూ, శ్రీకాకుళం జిల్లాలోని 32 రెవెన్యూ, 41 మత్స్యకార గ్రామాలు, 9 వార్డులు, రెండు వర్గాల అభిప్రాయాలతో రూపొందించారు. మొత్తం మూడు విభాగాల్లో విజన్‌ని ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఆర్థిక, ఉపాధి, జనాభా అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. 12.5 మిలియన్ల జనాభాను అంచనా వేస్తూ ప్రణాళిక రూపొందించారు. మొత్తం ఆదాయంలో పారిశ్రామిక రంగం 40 శాతం వాటా, సేవారంగం 50 శాతం, వ్యవసాయ రంగం వాటా 10 శాతంగా ఉండేలా అంచనాలు వేశారు. 

అదే విధంగా ఉద్యోగ, ఉపాధి కల్పనలో పారిశ్రామిక రంగంలో 28 శాతం, సేవా రంగంలో 45, వ్యవసాయ రంగంలో 27 శాతం ఉండేలా అంచనాలు రూపొందించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 19 లక్షల నుంచి 56 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. మొత్తంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వీఎంఆర్‌డీఏ విజన్‌ రూపొందించింది. 

మూడో మాస్టర్‌ప్లాన్‌ 
ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు గత 35 సంవత్సరాలుగా వుడా మాస్టర్‌ ప్లాన్స్‌ రూపొందించింది. మొదటిసారిగా 1989 నుంచి 2001 వరకూ 1721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్‌ ప్లాన్‌ అభివృద్ధి చేసింది. రెండోసారి 2006 నుంచి 2021 వరకూ 1,721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్‌ ప్లాన్‌ చేశారు. ఇప్పుడు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 6,501.65 చ.కి.మీ విస్తీర్ణంలో 2041 వరకూ మాస్టర్‌ ప్లాన్‌ రూపుదిద్దుకుంటోంది. మొత్తంగా మాస్టర్‌ ప్లాన్‌ను 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఏఏ ప్రాంతాల్లో.. ఎలాంటి అభివృద్ధి..? 
మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో అభివృద్ధి చెయ్యాలని మాస్టర్‌ప్లాన్‌లో వీఎంఆర్‌డీఏ సిద్ధమవుతోంది. వాటిని ఓసారి పరిశీలిస్తే... 

ఆరు దశల్లో పెర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌ 
మాస్టర్‌ ప్లాన్‌కి అనుబంధంగా పర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌ను వీఎంఆర్‌డీఏ రూపొందిస్తోంది. ఫీల్డ్‌ సర్వేలు, ట్రాఫిక్‌ సర్వేలు, బేజ్‌ మ్యాప్, అందుబాటులో ఉన్న భూ వినియోగం, వ్యూహాత్మక ప్రణాళిక, జోనల్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్లు.. ఇలా ఆరు దశల్లో 2051–పెర్‌స్పెక్టివ్‌ ప్లాన్‌పైనా కసరత్తులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాపై ప్రాథమిక సమీక్షను స్టేక్‌హోల్డర్‌లతో వీఎంఆర్‌డీఏ ప్రతినెలా నిర్వహిస్తోంది. 

46 మండలాలు.. 1,312 గ్రామాలు.. 
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తరించిన వీఎంఆర్‌డీఏ.. ఆ మేరకు ప్రణాళిక తయారు చేసింది. 2041 నాటికి జనాభా ఎంత పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి ఎలా ఉండబోతుంది.? ఉద్యోగ కల్పన, ఏ ఏ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలనే విషయాల్ని క్రోడీకరించారు. 

  • భోగాపురం విమానాశ్రయం నుంచి అచ్యుతాపురం పారిశ్రామిక కారిడార్‌ వరకూ ట్రాన్సిస్ట్‌ ఓరియంటెడ్‌ డెవలప్‌మెంట్‌–టీఓడీ కారిడార్‌(రవాణా ఆధారిత అభివృద్ధి వ్యవస్థ) ఏర్పాటు చెయ్యనున్నారు. 
  • మెట్రో కారిడార్‌ వెంబడి ఆర్థిక అభివృద్ధి చెందేలా కారిడార్‌ ఏర్పాటు 
  • విజయనగరం, అనకాపల్లి, నక్కపల్లి, భీమిలి ప్రాంతాలు గణనీయంగా విస్తరించనున్న నేపథ్యంలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు విస్తరణ. ఈ టౌన్‌షిప్‌లను అనుసంధానం చేస్తూ బీఆర్‌టీఎస్‌ కారిడార్లు ఏర్పాటు. ఏడు ప్రాంతాల్లో రవాణా స్టేషన్లు నిర్మాణం. 
  • అరకులోయ, బుద్ధిస్ట్‌ సర్క్యూట్, హిందూ దేవాలయాల సర్క్యూట్, బీచ్, కోస్టల్‌ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు. 
  • సహజ సంపద, వ్యవసాయ భూముల పరిరక్షణ. 
  • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. 


జోన్ల వారీగా వ్యూహాత్మక ప్రణాళిక 

ఎన్‌ఏడీ జంక్షన్‌ నుంచి పెందుర్తి వరకు.. 

  • చివరి వరకూ బీఆర్‌టీఎస్‌ కనెక్టివిటీ 
  • రహదారుల అభివృద్ధి 
  • మేఘాద్రి రిజర్వాయర్‌ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కు 
  • స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన 
  • ప్రాంతాభివృద్ధి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన 

గాజువాక–స్టీల్‌ప్లాంట్‌ పరిసరాలు 

  • నగర విస్తరణకు ప్రణాళికలు 
  • అంతర్గత రహదారుల విస్తరణ 
  • మెట్రో, సిటీ బస్సులతో నగర అంతర్గత రవాణా వ్యవస్థని అచ్యుతాపురం వరకూ మెరుగుపరచడం 
  • ఆటోనగర్, దువ్వాడ రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో విభిన్న తరహా అభివృద్ధికి ప్రణాళికలు 
  • ఎన్‌హెచ్‌–16లో పాదచారుల రక్షణ వ్యవస్థకు ప్రణాళికలు 

భీమిలి పరిసరాల్లో.. 

  • జీవీఎంసీతో కలిసి బీచ్‌ రోడ్డు అభివృద్ధి 
  • హెరిటేజ్‌ ప్రాంతంతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి  
  • ఫిషింగ్‌ హార్బర్‌ డెవలప్‌మెంట్‌ 
  • విశాఖపట్నం–విజయనగరం–భోగాపురం వరకూ రహదారుల అనుసంధానం 
  • భోగాపురం విమానాశ్రయం వరకూ టూరిజం అభివృద్ధి 

అనకాపల్లి పరిసరాలు 

  • నగర విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళికలు 
  • విశాఖపట్నం నుంచి అనకాపల్లి, అచ్యుతాపురం ఇండ్రస్టియల్‌ ప్రాంతం వరకూ బస్‌ ఆధారిత రవాణా వ్యవస్థ 
  • ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు బైపాస్‌ రహదారులు 
  • అనకాపల్లి టౌన్‌ ప్రధాన వీధిని పాదచారులకు అనుగుణంగా మార్పు 
  • ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతాలకు రహదారుల సౌకర్యం విస్తరించడం. 

మధురవాడ పరిసరాలు 

  • నగర విస్తరణకు ప్రణాళికలు 
  • మెట్రో రైలు మార్గం 
  • ఐటీ హిల్స్‌ పరిసరాల్ని విభిన్న అవసరాలకు అనుగుణంగా సెజ్‌గా మార్పు 
  • పరిసర ప్రాంతాల్లో సామాజికాభివృద్ధి 

 పోర్టు ఏరియా పరిసరాలు 

  • మెట్రో, సిటీ బస్సులతో రవాణా వ్యవస్థ మెరుగు 
  • బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ అభివృద్ధి 
  • యారాడ, సింహాచలం ప్రాంతాల్లో ఆక్రమణలకు చెక్‌ చెప్పడం 

పెదవాల్తేరు, చినవాల్తేరు పరిసరాలు 

  • ప్రాంతాభివృద్ధికి ప్రణాళికలు 
  • మెట్రో, సిటీ బస్సు సౌకర్యాలు 
  • స్మార్ట్‌సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు 
  • బీచ్‌ఫ్రంట్‌ రీ డెవలప్‌మెంట్‌ 

దసపల్లా హిల్స్‌ పరిసరాలు 

  • ఆయా ప్రాంతాల అభివృద్ధి 
  • హెరిటేజ్‌ ఏరియా సంరక్షణ, పరిసరాల అభివృద్ధి 
  • మెట్రో, సిటీ బస్సులతో కనెక్టివిటీ 
  • స్మార్ట్‌సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు 

మార్చి నాటికి మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ 
వీఎంఆర్‌డీఏ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరి్ధష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించిన డేటా కలెక్షన్‌ పూర్తయింది. వచ్చిన వివరాలను పరిశీలన చేస్తున్నాం. మాస్టర్‌ ప్లాన్‌ డ్రాఫ్ట్‌ని మార్చి నెలాఖరునాటికి సిద్ధం చేస్తాం. విశాఖ నగరానికి సమాన పోలికలున్న కొచ్చిన్, చెన్నై, సూరత్, ముంబై నగరాల్ని అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఈనెలలో కొచ్చిన్, చెన్నై నగరాలు, వచ్చే నెలలో సూరత్, ముంబై నగరాలకు మా బృందాలు వెళ్తున్నాయి. అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలపై నివేదిక సిద్ధం చేసి.. ఆ తరహా పరిస్థితులు వీఎంఆర్‌డీఏ పరిధిలోని ప్రజలకు ఎదురవకుండా సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నాం.  –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement