హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో వోల్వో బస్సు దగ్ధమై 45 మంది సజీవ దహనమైన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర రెడ్డిని అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధిత కుటుంబాల వారు ఈరోజు సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఒక్కో బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్సులకు స్పీడ్ కంట్రోల్ మీటర్స్ పెట్టాలని కోరారు. తక్షణ చర్య తీసుకోకుంటే దీక్షకు దిగుతామని వారు హెచ్చరించారు.
ప్రమాదానికి గురైన బస్సుపై జబ్బార్ ట్రావెల్స్ పేరు రాసి ఉన్నా, దాని అసలు యాజమానులు జెసి సోదరులేనని వారు ఆరోపిస్తున్నారు. బస్సుకు సంబంధించిన పర్మిట్లు, పన్ను చెల్లింపులు ఇప్పటికీ జేసీ సోదరులకు చెందిన దివాకర్ రోడ్ లైన్స్ పేరుతోనే జరుగుతోంది. ప్రభాకర్‌రెడ్డి నడుపుతున్న దివాకర్ రోడ్ లైన్స్ ఈ బస్సును (ఏపీ02 టీఏ 0963) 2010లో ఆయన భార్య జేసీ ఉమారెడ్డి పేరుతో కొనుగోలు చేసింది. కర్ణాటక రవాణా శాఖ వెబ్‌సైట్లో కూడా బస్సు యజమానిగా ఇప్పటికీ ఆమె పేరే ఉంది. అయితే ప్రభాకర్‌రెడ్డి మాత్రం బస్సును 2010లోనే జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించినట్లు చెబుతున్నారు.