
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బోగస్ ఓటర్ల జాబితాపై 15 రోజుల్లో తనిఖీ పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయసు గల యువత 18 లక్షల మంది ఉన్నారని, వారిలో కేవలం 5.39 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారని చెప్పారు. అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ద్వివేదీ శుక్రవారం సచివాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు, బీజేపీ తరపున గరిమెళ్ల చిట్టిబాబు, సీపీఐ తరపున మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీసీఎం తరపున వై. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం ద్వివేదీ విలేకరులతో మాట్లాడారు. ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే సరిపోదని, ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని చెప్పారు. పేరు లేకపోతే వెంటనే ఓటర్‌గా నమోదు చేసుకోవాలన్నారు.
ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదు
రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే దివ్యాంగులు 6.19 లక్షల మంది ఉన్నారని, అయితే ఓటర్లగా 3.29 లక్షల మంది మాత్రమే నమోదయ్యారని గోపాలకృష్ణ ద్వివేదీ చెప్పారు. కొంతమంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నా దివ్యాంగులని తెలియపరచని వారు ఉంటారని అన్నారు. దివ్యాంగులుగా నమోదు చేయించుకునే వారికి వాహన సౌకర్యం, పోలింగ్ బూత్ వద్ద వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని, పోలింగ్ బూత్‌ల వద్ద వారు బారులు తీరే అవసరం లేకుండా నేరుగా ఓటు వేసే సదుపాయం కల్పిస్తామని వివరించారు. ప్రస్తుత సాధారణ ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, వాటికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులందరి సెల్‌ఫోన్ నెంబర్లతో ఒక యాప్‌ని రూపొందిస్తున్నామని చెప్పారు.
ఓటర్లకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు
ఈసారి ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లకు మరిన్ని ఎక్కువ సౌకర్యాలు కల్పించనున్నట్లు ద్వివేదీ తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 45,920 పోలింగ్ కేంద్రాల వద్ద టాయిలెట్స్, కుర్చీలు, వీల్ చైర్స్, మంచినీరు వంటి వాటిని అందుబాటులో ఉంచుతామని, ఓటర్లు బారులు తీరకుండా ఓటు వేసే విధంగా టోకెన్ విధానం ప్రవేశపెడతామని చెప్పారు. గతంలో మధ్యప్రదేశ్‌లో టోకెన్ విధానం ప్రవేశపెట్టారని, అక్కడ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తుచేశారు. ఈ విధానం వల్ల ఓటర్‌కు సమయం ఆదా అవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై పరిశీలన జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం పాలుపంచుకునే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. తుది ఓటర్ల జాబితాను జనవరి 11న విడుదల చేశామని, ఆ జాబితాలో ఓటర్లను తొలగించడం గానీ, జత చేయడం గానీ ఇప్పటివరకు చేయలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.69 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 9 లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, వాటిలో కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి ఇచ్చిన ఫామ్–6 దరఖాస్తులు 7.36 లక్షల వరకు ఉన్నట్లు వివరించారు. బూత్‌స్థాయి అధికారులు వాటిని పరిశీస్తున్నారని, పది రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ పరిశీలనలో రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా పాల్గొనాలని కోరారు. ఈ నెల 11, 12 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో పర్యటించనుందని, ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించనున్నట్లు ద్వివేదీ తెలిపారు.
బోగస్ ఓటర్లపై విచారణ ప్రారంభమైందన్నారు: అంబటి
వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా భారీ క్యూలైన్లు లేకుండా టోకెన్ విధానం కొనసాగింపుపై ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదీ చర్చించారని వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు చెప్పారు. ద్వివేదీతో సమావేశం అనంతరం అంబటి విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసిన బోగస్ ఓటర్లపై విచారణ ప్రారంభమైందని, 15 రోజుల్లో విచారణ పూర్తవుతుందని ద్వివేదీ పేర్కొన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల నిర్వహణ, ఓట్ల నమోదుపై పార్టీ పరంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment