జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు
విజయనగరం ఫోర్ట్: కేంద్రాస్పత్రిని శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు జీతాలందక అవస్థలు పడతున్నారు. ఇచ్చే జీతం తక్కువే అయినా అది కూడా సకాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో కుటుంబాలను ఎలా నెట్టుకురావాలని ప్రశ్నిస్తున్నారు. జీతాలు మంజూరు చేయాలని గతంలో అధికారులకు పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు.
కేంద్రాస్పత్రిలో 52 మంది పారిశుద్ధ్య కార్మికులకుగా పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది వార్డుల్లో పనిచేస్తుండగా... మరికొంతమంది గార్డెన్ పనులు చేస్తుంటారు. ఆస్పత్రిలో గైనిక్, కంటి, జనరల్ సర్జరీ, ఎముకలు, ఎన్‌సీడీ, ఈఎన్‌టీ, దంత, పిల్లలు, మానసిక, మెడికల్, ఏఆర్‌టీ, ఫిజియోథెరిపీ ఓపీ విభాగాలున్నాయి. అదేవిధంగా మహిళల మెడికల్, శస్త్రచికిత్సల వార్డులు, పురుషల మెడికల్, శస్త్రచికిత్సల వార్డులు , బర్నింగ్ , ఎన్‌ఆర్‌సీ, పిల్లల వార్డు, ఆరోగ్యశ్రీ, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, ఐసీయూ, సిటీస్కాన్, ఎక్సరే, సూపరింటెండెంట్ కార్యాయలం, డీసీహెచ్‌ఎస్ కార్యాలయం, ఆపరేషన్ థియేటర్, ఈసిజీ గదులు ఉన్నాయి. వీటిన్నంటినీ ప్రతీరోజూ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేయలి. కొన్నింటిని ఒకటి, రెండు సార్లు శుభ్ర పరచాలి. మరికొన్నింటిని నాలుగు, ఐదుసార్లు శుభ్రపరచాల్సి ఉంటుంది.
నెలల తరబడి..
పారిశుద్ధ్య కార్మికులకు 2018 ఆక్టోబర్ నెల నుంచి జీతాలు రావడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు నెలకు రూ.6200 జీతం ఇస్తున్నారు. ఇచ్చే జీతం తక్కువే అయినప్పటికి సకాలంలో రాకపోవడం కుటుంబాలను నెట్టుకురాలేకపోతున్నారు. అధికారులు కూడా వీరికి జీతాలు ఇప్పించడంలో చొరవ చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామారాజును పలుమార్లు కోరామని.. అయినా ఫలితం లేకపోయిందని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వాస్తవమే..
పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు మంజూరుకాని మాట వాస్తవమే. నాలుగైదు రోజుల్లో వేతనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటాం.– కె. సీతారామరాజు,సూపరింటెండెంట్, కేంద్రాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment