ఆకలి కేకలు | Wages Shortage in ICDS Vizianagaram | Sakshi
Sakshi News home page

ఆకలి కేకలు

Published Sat, Jan 5 2019 7:55 AM | Last Updated on Sat, Jan 5 2019 7:55 AM

Wages Shortage in ICDS Vizianagaram - Sakshi

ఐసీడీఎస్‌ కార్యాలయం

విజయనగరం :నింగిని తాకే ధరలతో నిత్యం బతుకు పోరాటం చేయాల్సిన రోజులివి. జీతం ఒకటి.. రెండ్రోజులు ఆలస్యమైతే విలవిల్లాడిపోతారు. మరి ఆరు నెలలుగా జీతాలకు నోచకపోతే ఏం తినాలి.. ఎలా బతకాలి.. ఐసీడీఎస్‌ శాఖ నిర్వహిస్తున్న పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో పనిచేస్తున్న బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్ల దీనావస్థ ఇది.

ఐసీడీఎస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. జిల్లాలో 17 ప్రాజెక్టుల్లో 16 మంది పని చేస్తున్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయంలో ఒక బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్‌ పనిచేస్తున్నారు. వీరిలో 9 మందికి గత ఏడాది జూలై నెల నుంచి జీతాలు అందలేదు.

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు
గంట్యాడ, వియ్యంపేట, ఎస్‌.కోట, నెల్లిమర్ల, భద్రగిరి, కురుపాం, పార్వతీపురం, సాలురు రూరల్, సాలురు అర్బన్, బొబ్బిలి రూరల్, బొబ్బిలి అర్బన్, బాడంగి, భోగాపురం, విజయనగరం అర్బన్, చీపురుపల్లి, పాచిపెంట, గజపతినగరం ప్రాజెక్టులున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయం ఉంది. వీటిలో భద్రగిరి, కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి రూరల్, పాచిపెంట, బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, విజయనగరం పీడీ కార్యాలయం బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్లు జూలై నెల నుంచి జీతాలు అందలేదు.

పండగ రోజూ పస్తులు
ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్లకు నెలకు ఒక్కొక్కరికి జీతం రూ.15 వేలు, పీడీ కార్యాలయంలో పనిచేస్తున్న బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్‌కు నెలకు రూ.18 వేలు ఇస్తున్నారు. ఆరు నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి అప్పులు చేస్తున్నామని వాపోతున్నారు. బ్లాక్‌ ప్రాజెక్టు అసిస్టెంట్‌ పనిచేసే పోషణ అభియాన్‌ కార్యక్రమంలో ఇటీవల జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చింది. అయినప్పటికీ వీరికి మాత్రం జీతాలు అందలేదు.

బ్లాక్‌ అసిస్టెంట్ల విధులు
ప్రాజెక్టు కార్యాలయాల్లో రిపోర్టులు రాయడం, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం, సీమంతాలు, అన్న ప్రాశన తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలి. గర్భిణులు తీసుకోవలసిన ఆహారం, జాగ్రత్తలను వివరించాలి.

కలెక్టర్‌కు నివేదన
కొనసాగింపు ఉత్తర్వులు రాకపోవడం వల్ల వారికి జీతాలు రాలేదు. మిగిలిన చోట్ల ఖజానా శాఖ అభ్యంతరాలు తెలపకపోవడం వల్ల జీతాలు చెల్లించారు. జీతాలు రాని వారికి కొనసాగింపు ఉత్తర్వుల కోసం కలెక్టర్‌కు ఫైల్‌ పెట్టాం.– శాంతకుమారి,ఏపీడీ, ఐసీడీఎస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement