కట్టు..ఉంటే ఒట్టు..!
యాత్రలన్నీ కలిపి కాంగ్రెస్ పీకనులిమే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కు, అధినేత్రి సోనియాకు దక్కించేందుకు కృషిచేయాలని ఆ పార్టీ ఆదేశాలిస్తుంటే జిల్లాలో వర్గాలకు ఊతమిస్తూ నేతలు వ్యవహరిస్తున్నారు. తమ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు వినియోగించుకుంటున్నారు. ఇటీవల ఎంపీ వీహెచ్ చేపట్టిన రథయాత్ర వర్గాల కుంపట్లను రాజేయగా త్వరలో దాన్ని తిప్పి కొట్టి తన సత్తా చాటేందుకు జిల్లా మంత్రి డికే ఆరుణ సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధిః పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అదీ ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజానీకం చేస్తున్న పోరాటం ఫలితం. కొన్ని కోట్లమంది ప్రజానీకం మనోభావం. దీనికి అనుగుణంగా కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రకటన చేసింది. అంతవరకూ ఓకే. ఇప్పుడు దాన్ని తమ పార్టీ క్రెడిట్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కాంగ్రెస్ నేతలు తంటాలు పడుతున్నారు. కలిసి కట్టుగా ఈ అంశాన్ని ప్రచారం చేయాల్సింది పోయి ఎవరికివారు యమునా తీరు చందాన వ్యవహరిస్తున్నారు.నాయకుల మధ్య నెలకొన్న మనస్పర్థల వల్ల కలసి మెలసి పని చేసేందుకు వారు ఇష్టపడటం లేదు. వర్గాలు విచ్చుకొని అసలు విషయాన్ని పక్కనపెడుతున్నాయి.
జిల్లాలో మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో అం తా తానై ముందుకెళ్తుండటంతో స్పీడును తగ్గించేందు కు వ్యతిరేకవర్గంగా ఉన్న కేంద్రమంత్రి జయపాల్‌రె డ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు లోలోపల తీవ్ర యత్నాలు చేస్తున్నారు. జైత్రయాత్ర పేరుతో మం త్రి డీకే అరుణ ఇప్పటికే ఒక దఫా జిల్లాలో పర్యటించడంతో పాటు తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులను ఆహ్వానించి గత ఏడాది అక్టోబర్ 29వ తేదీన గద్వాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసినా వ్యతిరేకవర్గం వారు ఎక్కడా కూడా పాల్గొనలేదు. రథయాత్ర పేరుతో తాజాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈ నెల 2వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించడంతో ఈ అవకాశాన్ని డీకే అరుణ వ్యతిరేక వర్గం సద్వినియోగం చే సుకున్నారు.
హనుమంతరావు రథయాత్ర అంతా కూడా ఆమెకు వ్యతిరేకవర్గంగా ముద్రపడిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కనుసన్నలలోనే సాగింది. ఈ యాత్ర కొనసాగిన సమయంలో డీకే అరుణ విదేశాలకు వెళ్లడంతో ఆమె ఈ యాత్రకు దూరంగా వున్న విషయం తెలిసిందే. వీహెచ్ యాత్ర వెంట అరుణ వర్గం వెళ్లినా వారికి అక్కడ పెద్దగా ప్రా ధాన్యత లభించలేదనే విమర్శలున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వర్గానికి చెందిన సూదిని రాంరెడ్డి ఆమనగల్లు, తలకొండపల్లి , మాడ్గుల మండలాల నాయకు లు, కార్యకర్తలతో కలిసి చురుకుగా పాల్గొని హల్‌చల్ చేశారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, వెల్దండ, కల్వకుర్తి మండలాల పార్టీ శ్రేణులతో హడావిడి చేశారు.
నాగర్‌కర్నూల్‌లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కె.దామోదర్‌రెడ్డి, దిలీపాచారి వర్గాల మధ్య భేదాబిప్రాయాలు బయట పడ్డాయి. స్వాగత ఫ్లెక్సీల్లో తమ నాయకుడి ఫొటోలు పెట్టలేదని దామోదర్ రెడ్డి వర్గీయులు వాటిని చింపి వీరంగం చేయడంతో పార్టీ నాయకులు నివ్వెరపోయారు. ఆ తర్వాత దిలీపాచారిని వేదికపైకి పిలవలేదని కార్యకర్తలువర్గాలుగా విడిపోయి సభలో రసాభాస సృష్టించారు. దేవరకద్ర అసెంబ్లీ నియోజక వర్గంలోని కొత్తకోట, అడ్డాకుల, భూత్‌పూర్ మండల కేంద్రాల్లో జరిగిన యాత్రలో మంత్రి అనుచరులు ఎక్కడా కన్పించలేదు.
జైపాల్‌కు జైబోలో... జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన చిన్నారెడ్డి తెలంగాణ ఏర్పా టు ప్రకటనలో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారని గట్టిగా చెప్పారు. ఆయన వల్లనే హైద్రాబాద్ కేంద్ర పాలితం, రాయల తెలంగాణ అంశాలు మరుగున పడ్డాయని వెల్లడించారు. గతంలో కూడా మాజీ కేంద్ర మంత్రి మల్లికార్జున్ మలిదశ ఉద్యనికి శ్రీకారం చుట్టారని, ఆయన మరణానంతరం టీఆర్‌సీ కన్వీనర్‌గా బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నానని చెప్పుకున్నారు. అలాగే 2000 సంవత్సరంలో 41 మంది తెలంగాణ ఎమ్మెల్యేలను సమీకరించి పార్టీ అధిష్టానానికి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని తెలియజేశామని గుర్తు చేశారు. ఇందులో మంత్రి అరుణ. ఆమె వర్గాల ప్రమేయం ఏమీ లేదన్న రీతిలో చిన్నారెడ్డి ప్రసంగించి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైంది.
ఇప్పుడు అరుణ వంతు
ఈ నేపథ్యంలో డీకే అరుణ మళ్లీ తన ప్రాభవాన్ని చాటుకునేందుకు బస్సుయాత్రకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తనపై పార్టీలోని ఒక వర్గం చేసిన దాడికి దీటు గా సమాధాన మిచ్చేందుకు దాన్ని వినియోగించుకోవాలని ఆమె ఎత్తుగడ వేస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. బస్సు యాత్రలో ఎవ్వరైనా అడ్డుతగిలే పరిస్థితి ఏర్పడితే అక్కడికక్కడే తగిన రీతిలో సమాధానం ఇవ్వాలనే విధంగా పకడ్బందీ ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేసేందుకు మంత్రి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.