సచివాలయం మళ్లీ నీరుగారింది!
- పలు చాంబర్లలో లీకైన వాన నీరు
- ఊడిపడిన ఫాల్స్ సీలింగ్ కప్పులు
- తోడిపోస్తున్న మోటార్లు
- భయాందోళనలో ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చుతో వెలగ పూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం వర్షపు నీటితో తడిసిముద్దయింది. రెండు నెలల క్రితం తొలకరి జల్లులకే తాత్కాలిక అసెంబ్లీ భవనంలో నీరుగారితే, పలు గోడలకు పగుళ్లతో ఇటీవలే ఆ భవనంలో లోపాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పుడు చిన్న వర్షానికే తాత్కాలిక సచివాలయంలో నీరుగారడమే కాకుండా పెచ్చులు ఊడిపడ టంతో సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంగళవారం కురిసిన వర్షానికి మూడు, నాలుగు బ్లాకుల్లో పలుచోట్ల పెద్ద ఎత్తున వర్షపు నీరు లీకయ్యింది. పిల్లర్లు, కిటికీల నుంచి కూడా వర్షపు నీరు లోపలికి వచ్చింది. నాల్గో బ్లాకులోని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా చాంబర్లు, పేషీలు వర్షపు నీటితో తడిసి ముద్దయ్యాయి. రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేష న్ చాంబర్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఉద్యోగుల భయాందోళన..
మంత్రి గంటా, రెవెన్యూ చాంబర్లలో వర్షానికి ఫాల్స్ సీలింగ్ కప్పులు ఊడిపడుతుండటంతో ఉద్యోగస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. నాల్గో బ్లాకులోని కింది అంతస్తు గోడలు, పిల్లర్ల వెంబడి వర్షపు నీరు ధారాపాతంగా వస్తుండంతో ఉద్యోగస్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఊడిన పైకప్పులను కాంట్రాక్టు సంస్థ సిబ్బంది తొలగించారు. కారుతున్న నీటిని హౌస్‌కీపింగ్ సిబ్బంది బక్కెట్లతో తోడి పోశారు. మూడో బ్లాకులోని క్యాంటీన్లో కూడా వర్షపు నీరు కారింది. అక్కడ నేలంతా తడిసిముద్ద కావడంతో సిబ్బంది, సందర్శకులు ఆహారపదార్థాలు తినడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే సచివాల యంలోకి చేరిన నీటిని ఎప్పటికప్పుడు మోటార్లతో తోడి బయటకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
లోపాలు ఏమీ లేవు
సచివాలయంలోకి వర్షపు నీరు చేరుతోందని మీడియాలో వార్తలు చూసి మంత్రి నారాయణ సచివాలయానికి హడావుడిగా వచ్చారు. వర్షపు నీటితో తడిసి ముద్దయిన పలు చాంబర్లను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న సమస్య అని, భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. భవనం పైన ఉన్న డక్‌షీట్ బయటకు రావడం వల్ల వర్షపు నీరు లోపలికి చేరిందన్నారు.
లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్కే
సాక్షి, హైదరాబాద్: ఏపీ తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం లీకేజీ వెనకాల చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన ప్యాకేజీ ఎంతో బయటపెట్టాలని, లీకేజీ ఘటనలపై సీబీఐ విచారణ వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మీకు ఏ ప్యాకేజీ అందకపోతే కేవలం చదరపు అడుగుకు రూ.10 వేలు చొప్పున మీ కాంట్రాక్టర్లకు ఇష్టమొచ్చినట్టు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. లీకేజీ చిన్న విషయమని, దాన్ని పెద్దగా చూపించవద్దంటూ మంత్రి నారాయణ మాట్లాడడం దారుణమని తెలిపారు.
మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రజలకు తెలియాలంటే కచ్చితంగా దీనిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు. కొద్దిపాటి వర్షానికే ఇలా జరిగితే రేపు వచ్చే తుఫాన్ లకు బిల్డింగ్‌లుంటాయా, గాలిలో ఎగిరిపోతాయా అన్న సందేహం ప్రజలకు కలుగుతుందని ఆర్కే చెప్పారు. లీకేజీ ఘటనపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధపడాలని, భవన నిర్మాణం చేపట్టిన వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు.