కడెం, న్యూస్‌లైన్ :
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన కడెం ప్రాజెక్టు మన్ను తింటోంది. ఏటేటా పూడిక పెరిపోతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. కడెం ప్రాజెక్టును 1958లో నిర్మించారు. నీటి నిల్వ సామర్థ్యం 7.06 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. కనిష్ట స్థాయి మట్టం 675 అడుగులు. ఆయకట్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు కింద 85వేల ఎకరాలకు ఖరీఫ్ సీజన్‌లో సాగు నీరందిస్తోంది. జలాశయానికి ఎగువన కుంటాల, బోథ్, బజార్‌హత్నూర్, కుప్టి, పొచ్చెర, నాందేడ్ ప్రాంతాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఆయా ప్రాంతాల నుంచి వరద ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి చేరుతోంది. ఇలా వరదతోపాటు పెద్దయెత్తున మట్టి కూడా వచ్చి చేరతోంది. జలాశయంలో నీరు ఎక్కువైనప్పుడు అధికారులు గేట్లు ఎత్తి మిగులు జలాలు వదులుతారు. కానీ మట్టి మాత్రం అలాగే ఉండిపోతోంది. ఏటా నీటిలో పెద్ద ఎత్తున పూడిక మట్టి(సీల్టు) పేరుకుపోతోంది. దీంతో గుట్టలు గుట్టలుగా నిల్వ అయిన ఈ మట్టి క్రమంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తూ వస్తోంది.
తగ్గుతున్న నీటి సామర్థ్యం
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.06 టీఎంసీలు కాగా పూడిక కారణంగా క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టుకు నిర్మాణం సమయంలో పూడికకు గేట్లు కూడా ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ సరిగ్గా చేయక అవి ప్రస్తుతం తుప్పు పట్టాయి. ఫలితంగా మట్టి నిల్వ ఏటా పెరగడంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి.దీని ప్రభావం ఆయకట్టుపై పడుతోంది. ఏటా జలాశయంలో ఉన్న నీరు చాలక వారబందీ వంటి పద్ధతులతో ఆయకట్టు పంటలకు నీరు ఇచ్చే దుర్భర స్థితికి చేరింది. ఇలాగే కొనసాగితే మట్టితో మరో 20 ఏళ్లలో నీటి నిల్వ సామర్థ్యం మరింతగా త గ్గే ప్రమాదం ఉంది.
కొనసాగుతున్న సర్వే
ప్రస్తుతం ప్రాజెక్టులో పేరుకున్న మట్టి, నీటి నిల్వ సామర్థ్యం, లోతు, జలాశయం విస్తీర్ణం వంటి అంశాలపై నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని ఏపీ ఇంజినీరింగు రీసెర్చ్ లాబొరేటరీ బృందం ఈ నెల 6వ తేదీ నుంచి సర్వే చేస్తోంది. ఈ బృందంలో డెప్యూటీ ఈఈ జె.ఆశీర్వాదం, ఇంజినీర్లు అరుణశ్రీ, వెంకటరమణ, కిరణ్‌కుమార్, దేవానంద్, తదితర సిబ్బంది మొత్తంగా 13 మంది ఉన్నారు. సర్వే కోసం అత్యంత అధునాతన పరికరాలు ఉపయోగిస్తున్నారు. వీటి విలువ రూ.కోటీ 70 లక్షల వరకు ఉంటుంది. ప్రాజెక్టు గేజ్ రూం వద్ద డీజీపీఎస్ పరికరాన్ని అమర్చారు. సర్వే సమయంలో నీటిపై ఈ బృందం ఏ ప్రాంతంలో ఉన్నదో ఆ పరికరం(రిఫ్రెష్ స్టేషన్ )లో కనిపిస్తోంది. మిగతా జీపీఎస్(గ్లోబల్ పొజీషన్ సిస్టం) పరికరాలతో గ్రౌండ్ పొజిషన్ తెలుసుకుంటారు. నీటిలో లోతు ఎంత ఉన్నది, ఏ ప్రాంతంలో మట్టి నిల్వ ఎంత ఉన్నదీ చాలా స్పష్టంగా తెలుసుకునేందుకు కంప్యూటర్లను పడవలో అమర్చారు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడవలో ఈ బృందం సర్వే చేస్తోంది. సర్వేను ఇటీవల ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి, జాయింటు డెరైక్టరు జాన్ విక్టర్ తదితర ఉన్నతాధికారులు పరిశీలించారు.
1989, 2000లో కూడా సర్వే చేశారు. కానీ అప్పుడు ఇంత శాస్త్రీయ సర్వే జరగలేదు. కన్వెన్షనల్ హైడ్రోగ్రాఫిక్‌తో సర్వే చే శారు. 1989లో 6 టీఎంసీలకు, 2000లో 5.07 టీఎంసీలకు జలాశయంలో నీటి సామర్థ్యం తగ్గినట్లు తేలింది. జలాశయం మధ్యలో లోతు 56 అడుగుల వరకు ఉందని కనుగొన్నారు. 70 శాతం సర్వే పూర్తి కాగా.. మరో వారంలో సర్వే పూర్తి చేయున్నారు. ఇదే బృందం శ్రీశైలం, నాగార్జునసాగర్, ఏలేరు, జూరాల ప్రాజెక్టుల్లో సర్వే చేసింది. కడెం ప్రాజెక్టు తర్వాత ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులను కూడా సర్వే చేస్తామని ఈ బృందం తెలిపింది. సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని డెప్యూటీ ఈఈ జె.ఆశీర్వాదం తెలిపారు.
మన్ను తింటున్న ‘కడెం’
Published Tue, Nov 19 2013 4:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement