ప్రజాహితానికే ప్రాధాన్యం
మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ నేత కోలగట్ల
విజయనగరం మున్సిపాలిటీ న్యూస్‌లైన్: తనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టడంలో ఎన్నడూ ముందంజలో ఉంటానని, ప్రజాహితానికే ప్రాధాన్యం ఇస్తానని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నేత కోలగట్ల. వీరభద్రస్వామి అన్నారు. గత నెల 21న పట్టణ పెద్దల సమక్షంలో తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, దానిని బుధవారం శాసన మండలి చైర్మన్ చక్రపాణితో ఆమోదింప చేసుకున్నానని అన్నారు. గురువారం ఆయన విజయనగరంలోని తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువసార్లు ఓటమినే ఎదుర్కొన్నానని, పదవి ఉన్నా లేకున్నా అవసరమని తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సేవలందించానన్నారు.
ప్రజాసేవ కోసం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి తన ఇంటి గేట్లు తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనపై పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు లబ్ధిపొందేందుకు దుష్ర్పచారాలు చేశారని మండిపడ్డారు. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు తలదించుకునే పని తానెప్పుడూ చేయనని వ్యాఖ్యానించారు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పని చేస్తానని హమీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ నాయకుడు మామిడి అప్పలనాయుడు మాట్లాడుతూ తమ నాయకుడు కోలగట్ల సంప్రదాయబద్ధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆమోదింపచేసుకున్నారని సమర్థించారు.
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కోసం పని చేసేందుకు కృషి చేస్తానన్నారు. మరో నాయకుడు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ రాజకీయాల్లో మాటకు కట్టుబడి ఉండడం చాలా కష్టమని, అయితే దానిని కోలగట్ల చేసి చూపించారన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్‌లు ఎస్‌వీవీ రాజేష్, ఆశపు.వేణు, బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.