తప్పుడు కేసులకు బెదరం
సాక్షి, చిత్తూరు: ‘అధికారపార్టీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ...వెరవం, బెదరం. అధికారం లేకపోయినా తట్టుకోగలం. ఆ పార్టీ ఆగడాలపై ఉద్యమిస్తాం. కార్యకర్తలను కాపాడుకుంటాం’ అని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ తనపై టీడీపీ నాయకులు అక్రమకేసులు బనారుుంచారని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ వద్ద నిరాహారదీక్ష చేపట్టారు.
ఈ ఆందోళనకు మద్దతుగా రాజం పేట ఎంపీ మిథున్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి దీక్షలో పాల్గొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతిచ్చా రు. వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై అధికార పార్టీవారు తప్పుడు కేసులు బనారుుస్తున్నారని వారు నిరసించారు. మొ న్న ఎమ్మెల్యే రోజాపై ఎస్సీ, ఎస్టీ కేసు, నిన్న భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్, నేడు పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌పై కేసులుపెట్టారని ఆరోపించారు.
ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ ఆగడాలు మితిమీరాయన్నారు. కార్యకర్తలను భయభాంత్రులకు గురి చేసేందుకే పార్టీ ముఖ్యనేతలపై కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉందన్నారు. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వారికి అండగా నిలబడతామన్నారు. అవసరమైతే పోరాటాలు చేస్తామన్నారు. అధికారం లేకపోయినా తట్టుకోగల శక్తి పార్టీకి ఉందన్నారు. టీడీపీ ఇలాగే ప్రవర్తిస్తే పుట్టగతులుండవన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతున్నందుకు అధికారపార్టీ సిగ్గుపడాలన్నారు. 10 సంవత్సరాలు ప్రతిపక్ష స్థానంలో ఉండి అధికారం చేపట్టిన టీడీపీ ప్రజాసమస్యలను విస్మరించిందని ఆమె విమర్శించారు. దీనిని ప్రశ్నిం చినందుకే వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. నగరిలో భగవంతుణ్ని దర్శించుకునేందుకు తాను వస్తే హారతి పళ్లెం కింద వేసి ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని విమర్శించారు. నిన్న భూమా, నేడు ఎమ్మెల్యే సునీల్‌పై తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. నేతలను టార్గెట్ చేసి కేసులు పెట్టినా భయపడేదిలేదన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ ఒక ఏఈ ఫిర్యాదు చేస్తే ఏకంగా ఎమ్మెల్యేపైనే కేసు పెట్టడం రాష్ట్ర చరిత్రలో తాను చూడలేదన్నారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. టీడీపీకి పోగాలం దాపురించిందన్నారు. రాబో యే కాలంలో ఆ పార్టీ కనుమరుగవుతుందన్నా రు. టీడీపీ నేతలు ప్రజాసమస్యలు పక్కన పెట్టి, ఎన్నికల హామీలను తుంగలో తొక్కి సొంత పనులు చక్కపెట్టుకుంటున్నారని ధ్వజ మెత్తారు. తప్పుడు కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరించాలని చూడడం దారుణమన్నారు.
పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తాను మోర్దానపల్లె సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగులున్నాయని తెలిసి స్థానిక డీఈని అడిగానన్నారు. పరిశీలిస్తామన్న డీఈ తనకు తెలియకుండానే నలుగురిని నియమించుకున్నారన్నారు. ఆ తరువాత తాను ముగ్గురిని అక్కడికి పంపగా, వారిని సైతం పనిలో పెట్టుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. తరువాత జీతాలు రాకపోతే ఆ ముగ్గురి విషయం అడిగేందుకు సబ్‌స్టేషన్‌కు వెళితే అక్కడ ఎవరూ లేదన్నారు.
అక్కడి నుంచి తిరిగి వెళ్లిన తరువాత కాంట్రాక్ట్ ఉద్యోగిపై దౌర్జన్యం చేశాననంటూ ఏఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే అని చూడాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. డాక్టర్ వృత్తిలో ఉన్న తాను ప్రజలకు మంచి చేసేందుకు అధికారులతో మాట్లాడడం కూడా తప్పేనా అంటూ వాపోయారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే కేసులుపెట్టారన్నారు. తక్షణం కేసును ఉపసంహరించుకోవాలని, ఏఈని సస్పెండ్ చేయాలని సునీల్ డిమాండ్ చేశారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలనే టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. వారు తప్పుడు కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందన్నారు. అధికారులు మంచిని కాపాడాలన్నారు. అధికార పార్టీకి వత్తాసు పలకడం మానుకోవాలన్నారు. వారిలో మార్పురాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ దీక్ష జరిగింది. ఈ దీక్షకు జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి మద్దతు ప్రకటించాయి. అనంతరం ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కుమార్‌రాజా, పార్టీ అధికార ప్రతినిధి తలపులపల్లె బాబురెడ్డి, యాదమరి జెడ్పీటీసీ సభ్యురాలు ఉష, పార్టీ నాయకుడు ధనుంజయరెడ్డి, రాజరత్నంరెడ్డి,శిరీష్, ప్రవీణ్, విద్యాసాగర్‌రెడ్డి, పూతలపట్టు సుబ్బారెడ్డి,రామచంద్రారెడ్డి, హరి పాల్గొన్నారు.