అనంతపురం: అధికారపార్టీ నేతలు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలుపడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, అభ్యర్థులపనితీరు బేరీజు వేసి సిట్టింగ్‌లను మార్చేందుకుసిద్ధమయ్యారు. ఈ జాబితాలో శింగనమల,గుంతకల్లు, పుట్టపర్తి ఎమ్మెల్యేలు ముందు వరుసలో ఉన్నారు.సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి 24న షెడ్యూలు, ఏప్రిల్ 4న పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయపార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్నికల కమిషన్ కూడా ఫిబ్రవరి చివరి వారంలో షెడ్యూలు ప్రకటించనున్నట్లు గతంలో వెల్లడించింది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
సిట్టింగ్‌లను మార్చేయోచనలో టీడీపీ!
అధికారపార్టీ నేతలు అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, అభ్యర్థుల పనితీరు బేరీజు వేసి సిట్టింగ్‌లను మార్చేందుకు సిద్ధమయ్యారు. ఈ జాబితాలో శింగనమల, గుంతకల్లు, పుట్టపర్తి ఎమ్మెల్యేలు ముందు వరుసలో ఉన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే, చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డినిప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి శాసనమండలికి పంపిస్తామని ఇప్పటికే స్పష్టం చేసినట్లు ఆపార్టీ వర్గాలు చెబుతున్నాయి. పుట్టపర్తి నుంచి ఎంపీ నిమ్మల కిష్టప్ప, లేదా ఆయన తనయుడిని నిలిపేందుకు ఆపార్టీ ప్రయత్నిస్తోంది. మొదట కిష్టప్ప పెనుకొండ టిక్కెట్టు ఆశించారు. ఈ క్రమంలో బీకే పార్థసారథిని ఎంపీగా నిలపాలని కూడా ఆపార్టీ మొదట భావించింది. అయితే చివరకు పార్థసారథికి పెనుకొండే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఎంపీగా కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాను బరిలో నింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే చాంద్‌బాషా వద్దని ‘పురం’ పరిధిలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్ మంత్రి దేవినేనికి చెప్పినట్లు తెలుస్తోంది. మడకశిరలో ఎమ్మెల్యే ఈరన్నపై అనర్హత వేటు పడటంతో, వచ్చే ఎన్నికల్లో తిరిగి ఈరన్నను ప్రకటిస్తే ఇబ్బందిగా ఉంటుందని, మరో అభ్యర్థి వేటలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
గుంతకల్లువైపే ‘కాలవ’ చూపు
మంత్రి కాలవ శ్రీనివాసులు ‘దుర్గం’ నుంచి కాకుండా ఈ సారి గుంతకల్లు నుంచి బరిలోకి దిగేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. రాయదుర్గం టికెట్ కాలవకు ఇస్తే సహకరించబోమని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఇప్పటికే అధిష్టానానికి స్పష్టం చేశారు. మరోవైపు జెడ్పీ చైర్మన్ పూలనాగరాజు రెండు వర్గాలతోనూ తనదైనశైలిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ప్రజావ్యతిరేకత, అవినీతి ఆరోపణలతో కాలవ కూడా అక్కడి నుండి తప్పుకునే యోచనలో ఉన్నారు.
అసెంబ్లీకే మొగ్గుచూపుతున్నజేసీ పవన్
జేసీ పవన్ కుమార్‌రెడ్డి కూడా సొంతంగా చేయించుకున్న సర్వేలో ఎంపీగా ఓడిపోతానని తెలుసుకున్నారు. దీంతో ఆయన గుంతకల్లు, అనంతపురం టిక్కెట్టు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా గౌడ్ బరిలో ఉండరనేది తెలుస్తోంది.
‘ఉన్నం’కే మరోఅవకాశమిచ్చే యోచన...
కళ్యాణదుర్గం నుంచి హనుమంతరాయచౌదరిని తప్పించాలని మొదట టీడీపీ భావించినట్లు తెలుస్తోంది.చౌదరి కుమారుడు మారుతి పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అయితే వీరికి కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి వీరు సహకరించరని తెలిసి తిరిగి చౌదరికే మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అనంతపురంలో పోటాపోటీ
అనంతపురం టిక్కెట్టుపై పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి బరిలో దిగాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో పాటు ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీలో అంతర్గత చర్చలు
వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జ్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నేడు ‘అనంత’కు రానున్నారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం నిర్వహించనున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్యే ప్రధానంగా పోరు జరగడంతో ఈ రెండు పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి సారించాయి.
అభ్యర్థులు లేక అవస్థ
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి జిల్లాలో పూర్తి భిన్నంగా ఉంది. పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ ఆయన కూడా జిల్లాలో గెలిచే పరిస్థితి లేదు. మరోనేత శైలజానాథ్‌దీ అదే పరిస్థితి. కర్ణాటక ఎన్నికలకు ఇన్‌చార్జ్‌గా వెళ్లిన ఈయన.. శింగనమల నుంచి బరిలో నిలవాలనుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరింత దూరమయ్యారు. ఈ క్రమంలో ఇద్దరికీ ఈ ఎన్నికల్లో కూడా డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదు. వీరి పరిస్థితి ఇలా ఉంటే జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ పోటీ కేవలం నామమత్రంగా ఉండబోతోందనేది స్పష్టమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని పరిస్థితి.
కార్యవర్గమే లేని ‘జనసేన’
ఇక జనసేనకు ఇప్పటికీ ‘పొలిటికట్ ఫ్లేవర్’ రాలేదు. జిల్లా కార్యవర్గమే లేదు. కాబట్టి దీన్ని రాజకీయపార్టీగా, ఎన్నికల్లో పోటీ చేసే ప్రధానపార్టీగా రాజకీయపక్షాలు భావించడం లేదు. సీపీఐ, సీపీఎంలు ఆ రోజు పరిస్థితులను బట్టి ఎవరితో ఒకరితో పొత్తుపెట్టుకునే అవకాశాలే ఎక్కువ. పొత్తు లేకపోతే కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యక్షబరిలో నిలిచే అవకాశం ఉంది. వారి ఓట్లు వారు సాధించుకునే పార్టీలు కావడంతో ఎన్నికలపై వామపక్షాలకు ముందస్తు ప్రణాళికలు ఏమీ లేనట్లే.
‘అనంత’ పార్లమెంట్‌లోనూ భారీ మార్పులు
శింగనమలలో విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలపై టీడీపీ అధిష్టానం అయిష్టంగా ఉంది. దీంతో కొత్తవారిని రంగంలోకి దించేందుకు యత్నిస్తున్నారు. బండారు రవి కుమారై శ్రావణి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజులు టిక్కెట్టు కోసం యత్నిస్తున్నారు. శ్రావణికి జేసీ దివాకర్‌రెడ్డి, రాజు కోసం మంత్రి కాలవ సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టీడీపీనీ వీడేందుకు విప్, ఎమ్మెల్సీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక గుంతకల్లులో జితేంద్రగౌడ్‌ను తప్పించి మధుసూదన్‌గుప్తాకు టిక్కెట్టు ఇవ్వాలని మొదట టీడీపీ భావించింది. అయితే టీడీపీలో చేరకుండా, సభ్యత్వం లేకుండా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న గుప్తా... టీడీపీతో పాటు ప్రజల్లో కూడా చలుకన అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment