
'రేషన్ కార్డులు లేవని బియ్యం ఇవ్వడం లేదు'
హుదూద్ తుపాను ప్రభావంతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద తుపాను బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ:హుదూద్ తుపాను ప్రభావంతో సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితులు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భీమిలి పట్నంలోని తోటవీధిలో తుపాను బాధితులను జగన్ పరామర్శించారు. తమ ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని, పడవులకు కొట్టుకుపోయాని జగన్ వద్ద వారు గోడు వెళ్లబోసుకున్నారు. తుపానుతో సర్వం కోల్పోయినా ప్రభుత్వం ఇప్పటి వరకూ పట్టించుకోలేదన్నారు.
తమ వద్దకు ఏ నాయకుడు రాలేదన్న విషయాన్ని జగన్ కు తెలిపారు. తమ కష్టాల గురించి ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నామని, కనీసం ఆహారం కూడా ప్రభుత్వం నుంచి అందలేదని వారు జగన్ ఎదుట ఆవేదన చెందారు. తమ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు తుపానులో కొట్టుకుపోయాయని.. రేషన్ కార్డులు లేవని బియ్యం కూడా ఇవ్వడం లేదన్నారు. తుపానుతో కట్టుబట్టులతో మిగిలినా.. ఏ అధికారి రాలేదని జగన్ కు తెలిపారు. తుపాను బాధితులకు సాయం అందే వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుందని వారికి జగన్ భరోసా ఇచ్చారు.