జన్మభూమిలో అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ నేతలు
నక్కపల్లి: హూదూద్ తుఫాన్‌కు నష్టపోయిన రైతులకు, ఇతర బాధితులకు ప్రభుత్వం తరపున ఏ పరిహారం ఇస్తున్నారో చెప్పాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యనిర్వాహకమండలి సభ్యుడు వీసం రామకృష్ణ అధికారులను నిలదీశారు. శనివారం నక్కపల్లి మండల కేంద్రంలో జరిగిన జన్మభూమి కార్యక్రమం వాడివేడిగా జరిగింది. ప్రత్యేకాధికారి శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు నాయకులు ఏకరువుపెట్టారు.
తుఫాన్ వల్ల భారీ నష్టం వాటిల్లిందని ఇళ్లు, ఉద్యాన వన తోటలు నష్టపోయిన వారికి ఇంతవరకు ఒక్కపైసా కూడా పరిహారం చెల్లించలేదని వీసం ఆరోపించారు. ఇళ్లకు, తోటలకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు పక్షపాతం చూపించారన్నారు. 90కి పైగా ఇళ్లు నష్టపోతే కేవలం 20కి మించి నష్టం వాటిల్లలేదని అధికారులు నివేదికలు తయారు చేసారన్నారు. ఇక తోటల విషయంలో ఎకరాకు 20కి మించి చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయడం తగదన్నారు.
గత ఏడాది మండలానికి మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్‌లను అన్ని గ్రామాల్లోను పంపిణీ చేసి నక్కపల్లిలో ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. సర్వేల పేరుతో అర్హుల పింఛన్లు రద్దుచేశారంటూ పలువురు బాధితులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం వందలాది దరఖాస్తులు వచ్చాయి. పింఛన్‌లను సర్పంచ్ వీ సం వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు శేషారత్నం, వీసం దేవి తదితరుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పలువురు గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఎంపిడీవో కృష్ణ, వైఎస్సార్ సీపీ నాయకుడు వీసం నానాజీ, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, దేవవరపు శివ పాల్గొన్నారు.
బాధితులకు ఏం పరిహారం ఇస్తారో చెప్పండి?
Published Sun, Nov 9 2014 3:03 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement