దుష్ట సంప్రదాయం.. నీచ రాజకీయం
- జన్మభూమి వేదికలపై టీడీపీ జెండాలు, ఓడిన అధికారపార్టీ నేతలు
- 'రంజాన్ తోఫా' అక్రమాల కాంట్రాక్టర్ కే సంక్రాంతి కానుక కాంట్రాక్ట్ మతలబేమిటి?
- అధికార టీడీపీ తీరుపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి ఫైర్
పట్నంబజారు(గుంటూరు): ప్రభుత్వం తలపెట్టిన జన్మభూమి కార్యక్రమం.. టీడీపీ నేతల పాలిట పునరావాసంగా మారిందని, ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ నేతలే జన్మభూమి వేదికలను ఆక్రమిస్తున్నారని, అధికారిక కార్యక్రమాల్లో పార్టీ జెండాలు పెట్టి దుష్టసంప్రదాయానికి తెరలేపారని అధికార తెలుగుదేశం తీరుపై మండిపడ్డారు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారరెడ్డి వెంకటేశ్వర్లు.
జన్మభూమి కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను అసలు పరిగణనలోకే తీసుకోకుండా చంద్రబాబు సర్కార్ నీచ రాజకీయాలకు ఒడిగట్టుతున్నదని ఆరోపించారు. శుక్రవారం గుంటూరు నగరంలోని అరంగల్ పేటలోగల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఉమ్మారెడ్డి.. జన్మభూమి, సంక్రాతి కానుకల విషయంలో ప్రభుత్వం తీరును ఎండగట్టారు.
'అధికార తెలుగుదేశం పార్టీ దుష్ట సంప్రదాయాలకు, నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఓడిపోయిన అధికార పార్టీ నేతలు జన్మభూమి-మన ఊరు కార్యక్రమాల్లో వేదికలపై ఆశీనులవుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు విలువ ఇవ్వకుండా రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీడీపీ జెండాలు పెట్టడం దుష్టసంప్రదాయం' అని ఉమ్మారెడ్డి అన్నారు. గత రెండు విడతల జన్మభూముల్లో 33 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 5 లక్షల సమస్యలను పరిష్కరించామని ప్రభుత్వం పేర్కొనగా, అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా 99శాతం సమస్యలను పరిష్కరించామని చెబుతుండటాన్ని బట్టే ఈ కార్యక్రమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదీ లేనిదీ అర్థమవుతున్నదని, అందుకే జన్మభూమి కార్యక్రమాల్లో ఎక్కడికక్కడ ప్రజలు.. మంత్రులు, అధికాలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్భాటాలకు నిధులెక్కడివి?
నిధుల కొరత కారణంగా కొన్ని పనులు చేయలేకపోతున్నామంటున్న సీఎం చంద్రబాబుకు నివాస ఏర్పాట్లు, ప్రత్యేక విమానాలు, విందు వినోదాలకు మాత్రం నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. చంద్రన్న కానుక కోసం రూ.360 కోట్లు కేటాయిస్తే, దానిలో రూ.180 కోట్లు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ఫొటోలు ముద్రించేందుకే ఖర్చయ్యాయన్నారు. 'రంజాన్ తోఫా' లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్ కే సంక్రాంతి సరుకుల కాంట్రాక్టును అప్పగించడంలో మతలు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో ఆఖరికి విద్యార్థులను కూడా వదలిపెట్టడం లేదని, గతంలో సేకరించిన విరాళాలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.