
రాయల తెలంగాణ అంటే యుద్దమే: శ్రవణ్
రాయల తెలంగాణ అంటే మరోసారి యుద్దం తప్పదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
హైదరాబాద్: రాయల తెలంగాణ అంటే మరోసారి యుద్దం తప్పదని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఇటు తెలంగాణకు అటు రాయలసీమకు ఇష్టంలేకపోయినా ఎందుకు బలవంతంగా కలపాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు.
ఆర్‌డీఎస్‌ను బద్దలు కొట్టినవారితో, మానవబాంబులం అయితామని, లాబీయింగ్‌లతో అడ్డుకుంటామని, తొండలు గుడ్లు పెట్టని భూములను అభివృద్ధి చేశామని హెచ్చరికలు చేసినవారితో ఎలా కలిసి ఉంటామని అడిగారు. పన్నుల్లేకుండా ట్రాన్స్‌పోర్టు కారిడార్ ఏర్పాటుచేయడానికి రాయల తెలంగాణ అంటున్నారా అని శ్రవణ్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో భూము కబ్జాలకోసం ప్రయత్నిస్తున్నారా అని అడిగారు. లేకుంటే కొన్ని రాజకీయపార్టీల ప్రాబల్యం పెంచుకోవడానికి రాయల తెలంగాణ అంటున్నారా అని ఆగ్రహంగా ప్రశ్నించారు. రామేశ్వరం పోయినా శనీశ్వరుడు పోలేదన్నట్టు 13 ఏళ్లు పోరాటం చేసినా అదే పెత్తనం ఎందుకన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలది తెలంగాణవాదమా, రాయల వాదమా అని శ్రవణ్ నిలదీశారు. తెలంగాణపై ఎలాంటి మెలికలు పెట్టినా తెలంగాణ కాంగ్రెస్ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరించారు.