కరీంనగర్, న్యూస్‌లైన్: పదిహేను రోజుల్లోగా జాయింట్ చెక్‌పవర్ రద్దు చేసి.. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోతే సీఎం కిరణ్ ఇంటిని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గతంలో చంద్రబాబు తరహాలోనే సీఎం కిరణ్‌ను ఇంట్లో బంధించి అయినా చెక్‌పవర్ తీసుకుంటామన్నారు. ఆదివారం కరీంనగర్‌లో బీసీ సర్పంచ్‌ల సన్మాన సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ జాయింట్ చెక్‌పవర్ అనేది సర్పంచ్‌ల ఆత్మగౌరవ సమస్య అన్నారు. సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోతే ఈజిప్టు దేశాన్ని విడిచిపారిపోయిన ముబారక్ గతే సీఎంకు పడుతుందన్నారు.
రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 150 ఎమ్మెల్యే, 22 ఎంపీ టికెట్లను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలను సీఎం, పీఎంలుగా ప్రకటించిన పార్టీలకే బీసీల మద్దతుంటుందన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పించాలన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో, రూ.50 వేల కోట్లతో కేంద్రంలో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, టీడీఎల్‌పీ ఉపనేత ఎల్.రమణ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.