
కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలి : కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. వీరి జీతాలను రెండింతలు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య బుధవారం కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలను రెండేళ్ల 8 నెలల క్రితం నిర్ణయించారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, జీవన సూచీ పెరుగుదల, రూపాయి విలువ తగ్గుదల, ద్రవ్యోల్బణం నేపథ్యంలో వీరి జీతాలను పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
రెగ్యులర్ ఉద్యోగులకు ఏడాదికి ఒకసారి ఇంక్రిమెంటు, ఆరునెలలకు ఒకసారి డీఏ పెంచుతారని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈ సదుపాయంలేని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉద్యోగ భద్రత కూడా లేని వీరికి కనీసం జీతాలైనా పెంచాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనోల వేతనాన్ని రూ. 8,400 నుంచి రూ.15 వేలకు, డ్రైవర్ వేతనాన్ని 10,900 నుంచి రూ.19 వేలకు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాన్ని 9,500 నుంచి రూ. 16,500కు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.