చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బాబు నెరవేర్చలేదన్నారు. సభలో ప్రతిపక్షం నిరుద్యోగ సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వం తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందన్న మాటలు ఏమయ్యాయని విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగాలు రాకపోగా...దాదాపు 50 వేల మంది ఉన్న ఉద్యోగాలను కోల్పోయారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షంతో చర్చకు రాలేకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరించారని విమర్శించారు. ప్రాధాన్యత గల అంశాలను సభలో చర్చకు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు.