
ఏమైందో ఏమో?
శ్రీకాకుళం క్రైం: ఏం కష్టమొచ్చిందో తలియదు... ఏం జరిగిందో అంతకంటే తెలియదు... తనను నమ్ముకుని ఉన్న మహిళను చచ్చిపోదాం రా అంటూ బలవంతంగా నాగావళి నదిలోకి తీసుకువెళ్లాడు. నదీ ప్రవాహంలో ఆ వ్యక్తి గల్లంతవగా మహిళను స్థానికులు ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. సంఘటనకు సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలు ఇవీ... హిరమండలం మండలం పిండ్రువాడకు చెందిన జి.పార్వతి, బ్యారేజీ సమీపంలో నివాసముంటున్న బి.నాగరాజు వేర్వేరు కుటుంబాలకు చెందినవారైనప్పటికీ సన్నిహితంగా ఉండేవారు. అయితే దీనికి ఎవరూ అడ్డుచెప్పలేదు. నాగరాజుకు బీపీ ఎక్కువగా ఉండ డం, మానసిక సమస్యలు, పార్వతి నడుం నొప్పితో బాధపడుతూ ఈ నెల 25న రిమ్స్‌లో చికిత్స కోసం చేరారు.
అయితే వీరిద్దరు సోమవారం ఉదయం రిమ్స్ నుంచి బయటకు వచ్చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఓ దుకాణంలో నాగరాజు పూటుగా మద్యం సేవించాడు. అక్కడి నుంచి ఇద్దరూ రిమ్స్‌కు వచ్చారు. బహిర్భూమికి వెళ్లాలంటూ నదికి పార్వతిని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా లోపలకు దింపాడు. ఇద్దరం కలిసి చచ్చిపోదామంటూ ముందుకు లాక్కువెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరూ నదిలో కొట్టుకుపోయారు. కొత్త వంతెన దాటిన తర్వాత నాగరాజు ఆచూకీ తెలియకుండాపోగా పార్వతిని ఫాజుల్‌బాగ్‌పేట రేవు వైపు అదే ప్రాంతానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడు. విషయం తెలిసి టూటౌన్ సీఐ రాధాకృష్ణ సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.
అనంతరం పార్వతిని చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నాగరాజు కని పించకపోవటంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పార్వతి కోట్టుకుపోతుండటం, ఆమెను కాపాడటాన్ని కొత్త వంతెన మీద నుంచి కొందరు చూశారు. వారిని చూసి మిగిలిన వారు కూడా వాహనాలు దిగి మరీ చూడటం మొదలుపెట్టారు. దీంతో కొత్త వంతెన మీద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పట్టణ ముఖద్వారం నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు ట్రాఫిక్ స్తంభించింది. సుమారు గంటసేపు ఇబ్బందులు తప్పలేదు.