ఇదేమి ఆదర్శం?
♦ 80 మంది పిల్లలు లోపున్నా ఓకే
♦ 100 దాటినా నో ఛాన్స్
♦ జాబితాలో జిమ్మిక్కులు
♦ విద్యామంత్రి ఇలాకాలో విచిత్రాలు
విద్యాశాఖా మంత్రి ఇలాకాలో విచిత్రాలు జరుగుతున్నాయి. ఆదర్శ పాఠశాలల ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలలు నిబంధనలతో పనిలేకుండా ‘ఆదర్శ’ జాబితాలో చేరిపోయాయి. అర్హత ఉన్న పలు స్కూళ్లు స్థానం దక్కించుకో లేకపోయాయి. వీటిని సరి చేయాల్సిన విద్యాశాఖ కూడా చోద్యం చూస్తోందంటూ ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం : ఆదర్శ పాఠశాలలపై ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేస్తోంది. అంతా పారదర్శకమంటూ హడావుడీ చేస్తోంది. కానీ వీటి ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని వైఎస్సార్‌టీఎఫ్, ఏపీటీఎఫ్ 1938 తదితర ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో అర్హత ఉన్న వాటిని ‘ఆదర్శ’ంలోకి చేర్చకపోవడమే కాదు.. అనర్హత స్కూళ్లకు కూడా అవకాశం కల్పించార ని ఆరోపిస్తున్నాయి.
అందుకు సంబంధించి వివరాలతో సహా జిల్లా విద్యాశాఖాధికారికి కూడా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. విశాఖ నగరంలోని ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలు (ప్రాథమిక పాఠశాలలు లేనందున) మినహా జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 231 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అధికారులు ఎంపిక చేశారు. వీటిలో నియోజకవర్గాల వారీగా మాడుగులలో 16, చోడవరంలో 40, నర్సీపట్నం 19, పరవాడ 10, పాయకరావుపేట 35, అనకాపల్లి 17, భీమిలి 38, యలమంచిలి 21, విశాఖ తూర్పు 6, విశాఖ పశ్చిమం 3, గాజువాక 13, పాడేరు 6, అరకులో 7 స్కూళ్లను ఖరారు చేశారు.
ఇందులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలిలో 38, చోడవరంలో అత్యధికంగా 40, పాయకరావుపేటలో 35 పాఠశాలలు మెజార్టీ ఆదర్శానికి నోచుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 80 మంది పిల్లలకు మించి ఉన్న వాటిని ఆదర్శ పాఠశాలగా మార్పు చేయాలి. కానీ పలుచోట్ల అందుకు విరుద్ధంగా 80 నుంచి 155 మధ్య పిల్లలున్న స్కూళ్లను కూడా గుర్తించలేదని, పైగా 80 లోపు సంఖ్య ఉన్న పాఠశాలల్లో హాజరును ఎక్కువగా చూపి మోడల్ జాబితాలో చేర్చారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వారి చెబుతున్న దాని ప్రకారం విద్యార్థుల సంఖ్య 80 దాటినా ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక కాని స్కూళ్ల వివరాలు..
80 దాటినా ‘ఆదర్శ’ం లేదు..
అచ్యుతాపురం మండలం పూడిమడక పాఠశాలలో 92 మంది, చోడపల్లిలో 88, బుచ్చెయ్యపేట మండలం వడ్డాది (కె)లో 83, చినగదిలి మండలం గాంధీనగర్‌లో 155, చంద్రంపాలెం 137, లక్ష్మీనగర్ 130, పాత అడవివరం 95, పీఎంపాలెం 125, ఇందిరానగర్ 93, వెంకటాపురం 92, రాజీవ్ గృహకల్ప కాలనీ 90, గోపాలపట్నం 83, శివశక్తినగర్ 82, తోటగరువు 173, పెందుర్తి దొగ్గవానిపాలెం కాలనీలో 97 మంది, గంగిరెడ్ల కాలనీ పాఠశాలలో 96 మంది పిల్లలు ఉన్నారు.
చోడవరం జి-స్ట్రీట్‌లో 107, పీఎస్.పేటలో 100, కె.కాలనీలో 97, దేవరాపల్లిలో 94, గొలుగొండ మండలం వేజంగిలో 87, కె.కోటపాడు మండలం గరుగుబిల్లిలో 110, నర్సీపట్నం మండలం బలిఘట్టంలో 146, ఎస్సీ కాలనీలో 140, శివపురంలో 89 మంది చదువుతున్నారు. పాయకరావుపేట పట్టణం దుర్గానగర్ స్కూల్లో 95, పాతహరిజనపేటలో 83, శ్రీరాంపురం మెయిన్‌లో 91 మంది, ఎస్.రాయవరం మండలం దార్లపూడి పాఠశాలలో 82 మంది పిల్లలు ఉన్నారు. ఇలా 80 మందికి పైగా పిల్లలున్న 28 స్కూళ్లను లెక్క తేల్చారు.
సంఖ్యను ఎక్కువగా చూపి..
అంతేకాదు.. పిల్లల సంఖ్య 80 కంటే తక్కువ ఉన్న స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చేందుకు కొంతమంది కంప్యూటర్లలో మార్పులు చేసి 80కి పైగా చూపారని అంటున్నారు. అలాంటి వాటిలో పీఎంపాలెం ఆర్‌హెచ్‌సీలో పిల్లలు 80 లోపుండగా 87 మందిగాను, జీవీఎంసీ ఒకటో వార్డు సంతపాలెంలో 66కి 96 గాను చూపారని చెబుతున్నారు.
నిబంధనల మేరకే ఎంపిక
నిబంధనల మేరకే ఆదర్శ పాఠశాలల ఎంపిక జరిగింది. ఒకే ప్రాంతంలో కిలోమీటరు పరిధిలోని 80 మంది పిల్లలకంటే లోపున్న పాఠశాలను సమీపంలోని మరో స్కూలులో విలీనం చేశాం. వీటి ఎంపికలో తేడాలున్నాయని కొంతమంది ఉపాధ్యాయ యూనియన్ల నాయకులు నా దృష్టికి తెచ్చారు. కానీ వారి ఆరోపణలు నిజం కావు.
-ఎం.వెంకటకృష్ణారెడ్డి, డీఈవో