ల్యాండ్ పూలింగ్‌కు బ్రేక్!
- వివాదాస్పద గ్రామాల్లో ప్రక్రియ నిలుపుదల
- పునర్విచారణ చేయిస్తామన్న వుడా వీసీ
- విచారణకు సిద్ధమన్న మంత్రి గంటా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : రూ. వందల కోట్ల విలువైన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా అక్రమంగా కొట్టేయాలనుకున్న ఓ మంత్రి, అధికార పార్టీ నాయకుల పన్నాగానికి బ్రేకు పడింది. వివాదాస్పద గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటివరకు సేకరించిన భూములపై పునర్విచారణకు వుడా అంగీకరించింది. ‘విశాఖ శివారు భూముల్లో సర్కారీ దోపిడీ.. రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఓ మంత్రి వ్యూహం’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) వర్గాల్లో కలకలం రేపింది.
వుడా వైస్ చైర్మన్ టి.బాబూరావునాయుడు మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లా డుతూ.. ‘సాక్షి’లో వచ్చిన కథనం నేపథ్యంలో పెందుర్తి మండలం ముదపాక సహా భీమిలి నియోజకవర్గంలోని ఇతర వివాదాస్పద గ్రామా ల్లో ల్యాండ్ పూలింగ్‌ను తాత్కాలికంగా నిలుపు దల చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు సేకరించిన భూములపై పునర్విచారణ జరిపిస్తా మని, మీడియా సమక్షంలోనే గ్రామసభలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అక్కడ నుంచి వచ్చే తదుపరి ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ శివారులోని 15 గ్రామా ల్లో వుడా చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ పూర్తి కాలేదన్నారు.
ఇప్పటివరకు 3 (సౌభాగ్యరాయపురం, దబ్బంద, కొమ్మాది) గ్రామాలకు సంబంధించిన భూముల వివరాలే కలెక్టర్‌కు నివేదించామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో సంబంధిత అసైన్డ్ భూముల రైతులు.. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న భూముల పరిహారాన్ని నేరుగా రైతులకే చెల్లిస్తామన్నారు. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇతరత్రా ఇచ్చే ప్రయోజనాలన్నీ భూ యజమానులకే తప్ప ఇతరులకు ఇవ్వబోమని స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా.. ‘సాక్షి’లో కథనం చూసిన వెంటనే మంత్రి అనుచరులు ఆయా ఊళ్లపై పడిపో యారు. స్వచ్ఛందంగా భూములను అప్పగించా మని చెప్పాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చారు.
విచారణకు ఆదేశించాం: మంత్రి గంటా
ల్యాండ్ పూలింగ్ అక్రమాలు జరిగాయనే విషయమై విచారణకు సిద్ధమేనని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సాక్షిలో వచ్చిన కథనంపై మంత్రి స్పందిస్తూ విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో మంగళ వారం మీడియాతో మాట్లాడారు. ‘వుడా ల్యాండ్ ఫూలింగ్‌లో జరుగుతున్న అవినీతి, అవకతవక లపై పత్రికల్లో వచ్చిన కథనాలు చూస్తున్నాను. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. తప్పు చేస్తే ఎవరినైనా ప్రభుత్వం వదిలిపెట్టదు’ అని పేర్కొన్నారు. ఓ మంత్రి హస్తం ఉందన్న విషయమై.. ‘ఎవరైనా సరే విచారణలోనే అన్నీ తేలుతాయి’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.