రామ..రామ ఏం కష్టాలో..!!
- గిరి మహిళలకు కు.ని అవస్థలు
- ఆరుబయటే ఆశ్రయం
- వెళ్లేందుకు అంబులెన్సూ లేదు
పెదబయలు, న్యూస్‌లైన్: మన్యంలో బతకడమంటే మాటలు కాదు..అడుగడుక్కీ అవస్థలు పలకరిస్తుంటాయి... గిరిజనులం టే సర్కారుకు చిన్నచూపో అధికారులకు నిర్లక్ష్యమో తెలియదుగానీ వారి విషయంలో ఏ సాయం చేయాలన్నా పాలకులకు చేతులు రావడంలేదు. చివరకు సర్కారు ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలోనూ ఇదే జరిగింది. వచ్చిన గిరిజన మహిళలకు ఎడాపెడా ఆపరేషన్లు చేసేసి వారిమానాన వారిని వదిలేశారు. దీంతోవారు తమ మీద తామే జాలిపడుతూ కాలం వెళ్లబుచ్చారు.
పెద బయలు, రూడకోట పీహెచ్‌సీ పరిధిలో గురువారం 52 మం దికి డీపిఎల్ ఆపరేషన్లు చేశారు. ఆ తరువాత వెం టనే వారిని ఆస్పత్రి లోపల వరండాలో కాకుండా ఆరుబయట పడుకోబెట్టారు. దీంతో వారు చీకట్లో ఆవస్థలు పడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేష న్లు చేయాలంటే ఆస్పత్రిలో ముందస్తుగా జనరేటర్ ఏర్పాటు చేయాలి. ఆపరేషన్లు చేయించుకున్నవారిని బెడ్స్‌పై పడుకోబెట్టాలి, వేడినీరు, మంచినీరు అందుబాటులో ఉంచాలి.
అలాగే నడిచి వెళ్లడం కష్టమవుతుంది కాబట్టి సర్కారీ అంబులెన్సులో వారి వారి ఇళ్లకు తీసుకెళ్లాలి. అయితే పెదబయలు పీహెచ్‌సీలో గురువారం ఈ సదుపాయాలు ఏమీ లేకుండానే ఆపరేషన్లు చేశారు. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆపరేషన్లు ప్రారంభించాల్సి ఉన్నా సాయంత్రం 5 గంటలకు ఈ ప్రక్రియ మొదలెట్టారు. దీంతో మహిళలు చీకట్లో ఆరుబయట దోమలతో నానా అవస్థలు పడ్డారు.
దీంతో ఈ బాధలు భరించలేక ప్రైవేటు వాహనాలకు అద్దె చెల్లించి గ్రామాలకు చేరుకున్నారు. స్థానిక పీహెచ్‌సీ అంబులెన్స్ కదలదని తెలిసినా ప్రైవేటు వాహనాలు వాహనాలు సమకూర్చకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రతిసారీ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా వైద్యాధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడం గమనార్హం. అయితే శిబిరానికి పాడేరు ఎస్‌పీహెవో లీలాప్రసాద్ హాజరవగా మహిళలు తమ అవస్థలను ఏకరువు పెట్టారు.