సాక్షి ప్రతినిధి, కడప: జమ్మలమడుగు...ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డ.. ఆ గడ్డపేరు చెప్పగానే జనం ఉలిక్కిపడేవారు.. నిత్యం చోటు చే సుకునే ప్రతీకారేచ్ఛ ఘటనలే ఇందుకు కారణం. అలాంటి చోట శాంతికుసుమాలు విరాజిల్లాలని సంకల్పించారు. అందుకు పదే ళ్ల కిందట బీజం పడింది. ఫ్యాక్షన్ నుంచి ఫ్యాషన్ వైపు మళ్లించేందుకు దృష్టి సారించారు. అందుకు తగ్గట్టుగా పారిశ్రామిక వృద్ధి సాధించారు. ఆర్థిక వనరులు పెంపొందించారు.
ఫ్యాక్షన్ కనుమరుగైందనుకుంటున్న తరుణంలో ఆటవిక రాజ్యం తెరపైకి వచ్చింది. పోలీసు యంత్రాంగం జడుసుకునేలా ప్రత్యక్షదాడులు చోటు చేసుకుంటున్నాయి. అధికారం చేతిలో ఉందనే జులుం అధికమైంది. ప్రశాంత జీవనం సాగిస్తున్న సామాన్య ప్రజానీకం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా జమ్మలమడుగు నియోజకవర్గం రికార్డులకెక్కింది. ఫ్యాక్షన్ రాజకీయాలు రాజ్యమేలుతున్న ఆప్రాంతంలో అలాంటి పరిస్థితులు రూపుమాపాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. అభివృద్ధి సాధిస్తే ఫ్యాక్షన్ రూపుమాపొచ్చనే నిర్ణయానికి వచ్చారు. ఆ దిశగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ప్రోత్సహించారు. జమ్మలమడుగు ఫ్యాక్షన్‌కు దూరమై ఫ్యాషన్ దిశగా పయనించాలనే నినాదంతో ఎమ్మెల్యే చర్యలు ఉండిపోయాయి.
పదేళ్లుగా అధికారంలో ఉంటున్న ఆయన నియోజకవర్గం సమగ్రాభివృద్ధి దిశగా కృషి చేశారు. వెనుకబడ్డ వర్గాలకు చేయూతనందించారు. ఆర్థిక వనరులు పెంపొందించేందుకు చేపట్టాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సహకారంతో పారిశ్రామికాభివృద్ధి సాధించారు. ఫ్యాక్షన్‌తో ముడిపడిన జీవితాలకు ఆర్థిక వనరులు సమకూర్చడంలో సఫలమయ్యారు. ఆమేరకు పదేళ్లుగా జమ్మలమడుగు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కమారుగా తీవ్ర ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.
విజృంభిస్తున్న తెలుగుతమ్ముళ్లు....
తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందనే ఏకైక కారణంతో స్థానిక దేశం నేతలు విజృంభిస్తున్నారు. పోలీసు యంత్రాంగం జడుసుకునేలా ప్రత్యక్షదాడులకు తెగబడుతున్నారు. ఈనెల 3,4 తేదీలలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న దాడులే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఓవైపు పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తున్నా మరోవైపు వారిపై ప్రత్యక్షంగా రాళ్ల దాడులు కొనసాగాయి.
144 సెక్షన్ అమల్లో ఉన్నా, వేలాది మంది గుంపులుగా చేరి ప్రత్యక్షదాడులకు తెగబడ్డారు. పదేళ్లుగా జమ్మలమడుగులో ఇలాంటి వాతావరణం చోటు చేసుకోలేదు. ప్రశాంత జీవనానికి అలవాటు పడ్డ ప్రజానీకం ఒక్కమారుగా ఉలిక్కిపడింది. పాతరోజులు గుర్తుకు చేసుకుని బెంబేలె త్తుతున్నారు. అధికారంలోకి వచ్చి నెల రోజలు తిరక్కముందే తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోయిన ఉందంతం జమ్మలబడుగు పట్టణ వాసుల మదిలో నిలిచిపోయింది. ఆదివారం నిర్వహించే చైర్మన్ ఎన్నికలో ఎలాంటి ఉపద్రవం ముంచుకు రానుందోనని భీతిల్లుతున్నారు.
చట్టానికి సంకేళ్లు తెగేనా.....
జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ చట్టానికి సంకేళ్లు వేసింది. నిబంధనల మేరకు 50శాతం కోరం ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డికి నేరుగా టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఎన్నికలు వాయిదా వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్నట్టుండి ఆర్డీఓ రఘునాథరెడ్డికి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం కూడా అదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతోనే చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లు సమాచారం.
ఆర్డీఓ రఘునాథరెడ్డి ఫోన్ కాల్‌లిస్టు బహిర్గతం చేయగల్గితే ఇది తెలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం నిర్వహించే చైర్మన్ ఎన్నికను ప్రశాంతంగా ముగించాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ప్రిసైడింగ్ అధికారి రామారావు ఏర్పాట్లు చేపట్టారు. కాగా అధికార పార్టీ ఇందుకు సహకరిస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పదేళ్లుగా కొనసాగుతున్న ప్రశాంత వాతావరణానికి భంగం లేకుండా చూడాల్సిన భాద్యత అధికారపార్టీ నేతలపై ఉంది. మరి ఏమేరకు అధికార యంత్రాంగానికి సహకరిస్తారో వేచి చూడాల్సిందే.
ఏమవుతుందో..!
Published Sat, Jul 12 2014 2:12 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement