- నిర్వాసితుల ధ్వజం
- పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా
అచ్యుతాపురం, న్యూస్‌లైన్: బార్క్ సిబ్బంది రౌడీల్లాగ ప్రవర్తిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చిప్పాడ మహిళలు సోమవారం పోలీసుస్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. బాబా ఆటమిక్ రీసెర్చిసెంటర్(బార్క్)కు ఎస్‌ఈజెడ్‌లో 2600 ఎకరాలు కేటాయించారు. ఈ స్థలంలో ఉన్న ఎర్రినాయుడుపాలెం, జోగన్నపాలెం, చిప్పాడ గ్రామాలను తరలించాల్సివుంది. చిప్పాడ గ్రామాన్ని తరలించలేదు. నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తామన్న ప్యాకేజీ మేరకు పట్టా భూములకు నష్టపరిహారం అందించాల్సి ఉంది.
వెదురువాడ వద్ద స్థలాలు కేటాయించి, ఉద్యోగాలు కల్పించి తమకు ఉపాధి కల్పిస్తేనే గ్రామాన్ని ఖాళీ చేస్తామని, అప్పటి వరకు ఫలసాయం తీసుకుంటామని కొంతకాలంగా నిర్వాసితులు ఉద్యమిస్తున్నారు. పలుమార్లు బార్క్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన బార్క్ అధికారి వెంకటరత్నం నిర్వాసితులు ఫలసా యం తీసుకునేందుకు తమకు అభ్యంతరంలేదని, పనులు మాత్రం అడ్డుకోకుండా చూడాలని పోలీసుల సమక్షంలో సూచించారు. దీంతో ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరిందనుకున్నారు.
అయితే ఇటీవల గ్రా మ మహిళలు జీడిమామిడి పిక్కలు సేకరించేందుకు వెళ్తున్నప్పుడల్లా సెక్యూరిటీ సిబ్బంది వారిని నిర్బం ధించి రాత్రి వరకు విడిచి పెట్టడం లేదు. సోమవారం ఉదయం 9 గంట లకు 15 మంది మహిళలను నిర్బంధించారు. మధ్యాహ్నం 2 గంట లకు బల వంతం గా వ్యాన్‌లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చారు. వారిపై కేసు నమోదు చేయాలని సెక్యూరిటీ అధికారి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాదితులకు అండగా ప్రగడ: విషయం తెలుసుకున్న గ్రామసర్పంచ్ అల్లుకృష్ణ, వైఎస్సార్ సీపీ అభ్యర్థి ప్రగడనాగేశ్వరరావు హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కి వచ్చి మహిళలకు అండగా నిలిచారు. జీడిపిక్కల సేకరణకు వెళితే బార్క్ సెక్యూరిటీ సిబ్బంది తమను నిర్బంధించడమేకాక మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, కర్రలతో కొట్టి బలవంతంగా వ్యాన్ ఎక్కించి స్టేషన్‌కు తెచ్చి కేసులు పెడుతున్నారని ప్రగడ ముందు వాపోయారు. దీంతో ప్రగడ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీల్లా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.
సీజన్‌లో రెండు నెలలు మాత్రమే మహిళలు బార్క్‌లోకి ప్రవేశిస్తారని, ఈసారి వారిని నిర్బంధిస్తే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. మహిళలను ఇబ్బంది పెడుతున్న బార్క్ సిబ్బందిపై కేసు పెట్టాలని ఎస్‌ఐ నర్సింగరావును కోరారు. అనంతరం ప్రగడ మాట్లాడుతూ నిర్వాసితులకు పలు సమస్యలు ఉన్నాయని, ఎన్నికల అనంతరం ఈ అంశాల పరిష్కారానికి నడుంబిగిస్తానని హామీ ఇచ్చారు. సీజన్ పూర్తయ్యేవరకు జీడిపిక్కల సేకరణకు అడ్డుపడవద్దని బార్క్ సిబ్బందికి సూచించారు.