కాపాడే వారెవరురా...! | Who Save Them | Sakshi
Sakshi News home page

కాపాడే వారెవరురా...!

Published Wed, Jun 20 2018 1:58 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

Who Save Them - Sakshi

తిరుమల బైపాస్‌ రోడ్డులోని అలిపిరి పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న  మొహబూబా లే అవుట్‌ పార్క్‌ స్థలంలో 1980 నుంచి రెండేళ్ల క్రితం వరకు ఇది కార్పొరేషన్‌ స్థలం.. ఎవరు ప్రవేశించినా శిక్షార్హులు అన్న బోర్డు ఉండేది. కానీ ఇప్పుడా ప్రదేశంలో భారీ భవంతి వెలసింది. కోటిన్నర రూపాయల విలువ చేసే 30 అంకణాల∙స్థలాన్ని అధికార పార్టీ నాయకుడు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కబ్జా చేశారు. కార్పొరేషన్‌ రికార్డుల ప్రకారం ఈ స్థలం ఇప్పటికీ పార్క్‌ స్థలమే. కొంతమంది అధికారులు కబ్జాదారుడికి సహకరించారు. కోటిన్నర విలువ చేసే స్థలాన్ని కట్టబెట్టేశారు.

సాక్షి, తిరుపతి తుడా : తిరుపతిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థలాలకు రక్షణ కరువైంది. కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఒక్కొక్కటిగా తరిగిపోతున్నాయి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ 27.44 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కొన్ని స్థలాలు ఏళ్ల క్రితమే కనుమరుగయ్యాయి. ఆ ఆక్రమణల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. అధికారులే ఆక్రమణదారులతో చేతులు కలుపుతున్నారు. స్థలాలకు ఎసరు పెడుతున్నారు. సుమారు 11 ప్రాంతాల్లోని స్థలాలను కబ్జారాయుళ్లు కొట్టేశారని అంచనా. ఇవన్నీపోగా ఇప్పుడు 43 స్థలాలు మాత్రమే మిగిలాయి. గతంలో కొంతమంది కమిషనర్లు స్థలాలను కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ మాత్రమైనా మిగిలాయని బాధ్యత కలిగిన కొంతమంది అధికారులు పేర్కొంటున్నారు.

మిగిలిన ఖరీదైన స్థలాలనైనా పూర్తిస్థాయిలో రక్షించేం దుకు అధికారులు చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. 2008లో కార్పొరేషన్‌లోకి మూడు పంచాయితీలు విలీనమయ్యాయి. ఈ ప్రాంతంలో 27స్థలాలు కార్పొరేషన్‌ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో 23 స్థలాలకు కనీసం ప్రహ రీ గోడలను కూడా ఏర్పాటు చేయలేదు. అప్పటి పంచాయితీలకు చెందిన స్థలాలు, ప్రైవేట్‌ వెంచర్లలో ప్రజా అవసరాలకు కేటాయించిన పార్కు స్థలాలు ఇప్పుడు కార్పొరేషన్‌ చేతిలోకి వచ్చాయి. పాత నగర పరిధిలో స్థలాలను కాపాడలేకపోయిన అధికారులు కనీసం విలీన పంచాయితీల స్థలాలనైనా కాపాడుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్‌ వెంచర్లలోని పార్కు స్థలాలను స్వాధీనం చేసుకుని ప్రహరీగోడ నిర్మించి స్థానిక అవసరాల నిమిత్తం అభివృద్ధి చేపడితేగానీ వీటిని కాపాడగలరు. ప్రహరీగోడలను సైతం నిర్మించకుండా అధికారులు ఈ స్థలాలపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీటిపై స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు కన్నుపడింది. ఆక్రమించి నిర్మాణాలు చేపట్టకముందే అధికారులు రక్షించుకోవాల్సిన బాధ్యత పై స్థాయి అధి కారులపై ఉంది.


ప్రైవేట్‌ వ్యక్తుల గుప్పెట..
కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలు ఇప్పటికే కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అధికారులు లీజు పేరుతో కార్పొరేషన్‌ స్థలాలను కొంతమందికి కట్టబెట్టారు. ఇప్పటికీ ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు సాహసించడం లేదు. లీజు పేరుతో స్థలాలను  ఆధీనంలో పెట్టుకున్న వ్యక్తులు కోర్టుద్వారా స్టేలు తెచ్చుకుంటూ ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. అధికారులు సమర్ధంగా తమ వాదనను కోర్టులో వినిపిస్తే ఎప్పుడో ఈ స్థలాలను కార్పొరేషన్‌ చేజిక్కించుకునేది. కొంతమంది అధికారులు ఆ వ్యక్తులతో లాలూచీ పడి విలువైన స్థలాలను కార్పొరేషన్‌కు రాకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

తిరుపతి  గాంధీరోడ్డు లాంటి ప్రాంతంలోని స్థలాన్ని అతితక్కువ అద్దెతో నెట్టుకొస్తున్నారు. పదేళ్ల నుంచి ఇక్కడ మల్టీ పార్కింగ్‌ కాంప్లెక్స్‌ కట్టాలని ప్రతిపాదన ఉంది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించే సాహసాన్ని అధికారులు చేయడం లేదు. ఈ స్థలా న్ని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా అధికారులు స్పందిం చడం లేదు. శ్రీనివాసం సముదాయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో 15 ఏళ్లక్రితం ఓ వ్యక్తి హోటల్‌ నడిపేందుకు కార్పొరేషన్‌ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి ఆ స్థలాన్ని తీసుకునేం దుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. రైల్వేస్టేషన్‌ పార్సిల్‌ సర్వీస్‌కు ఎదురుగా ఉన్న స్థలాన్ని ప్రైవేట్‌ పార్కింగ్‌ స్థలంగా మార్చేశారు. ఇలా అనేక ప్రాంతాల్లో కార్పొరేషన్‌ స్థలాలు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement