కోడెల, ధూళిపాళ్ల, కాలువ, కిమిడిలతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి ఎంపికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. శుక్రవారం స్పీకర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సుదీర్ఘ కసరత్తు చేశారు. స్పీకర్ పదవికి తాను ఎంపిక చేయదలచుకున్న, ఆ పదవి ఆశిస్తున్న నేతలతో ముఖాముఖి నిర్వహించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాదరావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులుతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. వీరు చెప్పిన మాటలను, చేసిన వాదనలను సావధానంగా విన్న చంద్రబాబు.. వారికి మాత్రం ఎలాంటి హామీనీ ఇవ్వలేదు.
నేడా.. రేపా.. ప్రకటన?
స్పీక ర్ పదవికి గురువారం నోటిఫికేషన్ విడుదల చే స్తారు. ఆ తరువాత నామినేషన్లను స్వీకరిస్తారు. శుక్రవారం స్పీక ర్ ఎన్నిక ఉంటుంది. గురువారం రాత్రికి లేదా స్పీక ర్ నామినేషన్ వేయడానికి ముందు సభాపతిగా ఎంపికయ్యే నేత పేరును చంద్రబాబు వెల్లడించే అవకాశం ఉంది.
బుధవారం కిమిడి తన కుటుంబ సభ్యులు, సమీప బంధువైన మంత్రి కిమిడి మృణాళినితోపాటు చంద్రబాబును కలిశారు. తనకు స్పీకర్ పదవి ఇవ్వాల్సిందిగా కోరారు. తాను సీనియర్ ఎమ్మెల్యేనని, గతంలో మంత్రిగా, ఎంపీగా పనిచేశానని, చట్టసభను సమర్థంగా నిర్వహించగలనని చెప్పారు. మీ గురించి నాకు పూర్తిగా తెలుసు.. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు.
కోడెల శివప్రసాదరావు తనకు స్పీకర్ పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతను చంద్రబాబుకు వివరించారు. తాను పార్టీలో సీనియర్‌నని, తన సమకాలికులందరికీ పార్టీలో న్యాయం జరిగిందని చెప్పారు. సామాజిక సమీకరణల వల్ల తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని అనుకుంటున్నానని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని, దాన్ని సరిచేస్తారని భావిస్తున్నానని వివరించారు. కోడెల చెప్పింది సావధానంగా విన్న చంద్రబాబు పరిశీలిస్తానని చెప్పారు.
చంద్రబాబుతో సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ భేటీ అయ్యారు. తాను తొలి నుంచీ పార్టీకి, నేతకు విధేయుడిగా ఉన్నానని వివరించారు. ‘పార్టీని, మిమ్మల్ని వెన్నంటి ఉన్నాను, మొన్న జరిగిన మంత్రివర్గ కూర్పులో స్థానం దక్కుతుందని ఆశించా, అయినా చోటు దక్కలేదు, నిరాశకు గురయ్యా, ఇపుడు స్పీకర్ పదవి ఇవ్వండి’ అని కోరారు.
కాలువ శ్రీనివాసులు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని కాలువ ఆశలు పెట్టుకున్నారు. ఇపుడు స్పీకర్ పదవి తనకు తప్పకుండా దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ స్పీకర్ పదవి కాకపోయినా ఉప సభాపతి పదవి అయినా వరిస్తుందన్న నమ్మకంతో కాలువ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరో?
Published Thu, Jun 19 2014 1:00 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM
Advertisement
Advertisement