సాక్షిప్రతినిధి, నల్లగొండ: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలే గడువు ఉన్న నేపథ్యంలో జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌లో రోజురోజుకూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి నియోజకవర్గాల్లో వారే పోటీ చేసే అవకాశాలు ఉన్నా.. ఈ చర్చ జరగడం విశేషం. ప్రత్యేకించి నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న అంశమే ఎక్కువగా ప్రచారంలో ఉంది. వాస్తవానికి నల్లగొండ సీటు అధికార కాంగ్రెస్ చేతిలోనే ఉంది. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎంపీగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా, ఈసారి ఎవరు పోటీచేస్తారన్న వార్త ప్రచారంలోకి రావడానికి బలమైన కారణమే కనిపిస్తోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి శాసనసభకు వెళ్లాలన్న వ్యూహంతో ఉన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో బలంగా ముద్ర వేసేందుకు సహకార ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను బాగానే వాడుకున్నారు.
ఆయన ప్రయత్నాలను గమనించిన ఎవరైనా ఈసారి ఎమ్మెల్యే పదవికే పోటీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. నల్లగొండ లోక్‌సభా స్థానం నుంచి రేసులో ఉండేది ఎవరన్న ప్రశ్నకు.. జిల్లా కాంగ్రెస్ వర్గాల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుఖేందర్‌రెడ్డి పోటీ చేయని పక్షంలో, మంత్రి జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, జానారెడ్డి తయుడు రఘువీర్‌రెడ్డి పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ వర్గాలు సరైన విశ్లేషణనే ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే పక్షంలో సీఎం పోస్టు రేసులో ఉన్న మంత్రి జానారెడ్డి కచ్చితంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీచేస్తారని చెబుతున్నారు. అపుడు, ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీచేయడానికి ముందుకు వస్తున్నారని అంటున్నారు.
జానారెడ్డి నాగార్జున సాగర్ , సుఖేందర్‌రెడ్డి మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే, నల్లగొండ ఎంపీ టికెట్ కోసం డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి మధ్యనే పోటీ ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే, ఈసారి జానారెడ్డి పార్లమెంటుకు వెళ్లేందుకు నల్లగొండ లోక్‌సభా స్థానాన్ని ఎంచుకోవచ్చని, అపుడు ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ పరిణామాలేవీ జరగకుండా సుఖేందర్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభ స్థానం బరిలోనే ఉంటే, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి పోటీ ఉంటుందని అంటున్నారు. కొన్ని సంవ త్సరాలుగా మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్‌ను మంత్రి జానారెడ్డి తన అనుయాయులకే ఇప్పించుకుంటున్నారు.
ఈసారి అదే జరిగితే ఆయన తనయుడి వైపు మొగ్గు చూపుతారా..? లేక, పార్టీలోని మరెవరైనా సీనియర్‌ను ఎంచుకుంటారా అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితినే ఎదుర్కునే అవకాశాలే ఎక్కువగా ఉన్నందున తెలంగాణ ప్రాంతంలోని ఒక్కో ఎంపీ సీటు ఎంతో కీలకమవుతుందని, అలాంటప్పుడు ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ బరిలోకి దింపుతుందని కూడా కాంగ్రెస్ నేతలు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి నల్లగొండ ఎంపీ సీటు విషయం ఇపుడు కాంగ్రెస్‌లో రక రకాల వార్తల ప్రచారానికి కారణమవుతోంది.