అసెంబ్లీని సమావేశపరిస్తే దొంగలెవరో తేలుతుంది
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్:అసెంబ్లీని సమావేశపరిస్తే సమైక్యాంధ్ర ఉద్యమంలో దొంగలేవరో తేలుతుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. స్థానిక నాలుగురోడ్ల కూడలిలో బుధవారం ఆమె సమైక్యాంధ్రకు మద్దతుగా 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడులు సమైక్యాంధ్ర విషయంలో రోజుకో డ్రామాకు తెర తీస్తున్నారన్నారు. ఆ రెండు పార్టీల నాయకులను ఉద్యమకారులు బయట తిరగనివ్వకపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజల దృష్టి మరల్చేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్‌తో కుమ్మక్కవడం వల్లే బెయిల్ వచ్చిందని చెబుతున్న టీడీపీ నేతల ఆరోపణల్లో పసలేదన్నారు. అది వాస్తవమే అయితే తమ నేత 16 నెలల పాటు జైలులో గడపాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా యూపీఏ ప్రభుత్వం తీసుకున్న విభజన నిర్ణయంపై పోరాటం సాగిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు కట్టుబడి రాజీనామాలు చేశారని.. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు పదవులను అంటిపెట్టుకుని ఉండటంలోని ఆంతర్యం ఏమిటో ప్రజలకు వివరించాలన్నారు.
సోనియాగాంధీ రాష్ట్ర విభజన ప్రకటనకు ముందే సీఎం కిరణ్‌ను ఢిల్లీకి పిలిపించుకుని విషయం చెప్పినా ఆయన అడ్డుకోలేకపోవడం సీమాంధ్ర ప్రజలను ద్రోహం చేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖతోనే విభజనకు శ్రీకారం చుట్టినట్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు బహిరంగంగా చెబుతున్నారని.. అయితే ఆయన మాత్రం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ టర్న్, ఈ టర్న్ అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. విభజనకు కారణమైన ఆ రెండు పార్టీలే జగన్‌ను విమర్శించడం దొంగే.. దొంగదొంగ అన్నట్లుగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయిన చంద్రబాబు ఇక అధికారం దక్కదనే ఉద్దేశంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు.