శాసనసభలో ప్రవేశపెట్టని తీర్మానంపై స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించడమేమిటని బీజేపీ విస్మయం వ్యక్తం చేసింది.
సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: శాసనసభలో ప్రవేశపెట్టని తీర్మానంపై స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించడమేమిటని బీజేపీ విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి పంపిన బిల్లుపై చర్చ పూర్తయిందని స్పీకర్ ప్రకటించిన తర్వాత ఇక తీర్మానం ప్రసక్తే ఉండదని పేర్కొంది. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి.. పార్టీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం ఓపక్క అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ మరోపక్క అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమానికి సీఎం ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.
సీమాంధ్రుల సమస్యలనూ పరిగణించాలి: జవదేకర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో పాటు సీమాంధ్రుల సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఏమన్నారంటే...
- ఢిల్లీ అయినా, వైజాగ్ అయినా, హైదరాబాద్ అయినా బీజేపీ ఒకేలా మాట్లాడుతుంది. కాంగ్రెస్ వేర్వేరు రకాలుగా మాట్లాడుతుంది.
- సొంత ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టే దృశ్యాలు కాంగ్రెస్‌లోనే కనిపిస్తాయి తప్ప, బీజేపీలో ఉండవు.
- తెలంగాణ ఏర్పాటుపై 60 ఏళ్లుగా కాంగ్రెస్ మోసం చేస్తోంది. తాజాగా సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి బిల్లును తిరస్కరించి మళ్లీ మోసం చేశారు.
- సుహృద్భావ వాతావరణంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఎలా చేయాలనే మార్గాన్ని అటల్ బిహారీ వాజ్‌పేయి చూపారు. విభజన ఎలా చేయకూడదనేది కాంగ్రెస్ చూపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ఉన్న స్పష్టమైన తేడా ఇదే. రెండు ప్రాంతాల్లో గొడవలు సృష్టించి కాంగ్రెస్ చెడగొడుతోంది.